ఉద్యోగుల వలసలు.. ఐటీ కంపెనీల దిగాలు

భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ లో ఉద్యోగుల వలసలు ఈ ఏడాది 28.4 శాతంగా నమోదయ్యాయి

Advertisement
Update: 2022-09-04 07:41 GMT

Representational Image

భారత్‌లో రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్‌ లో ఉద్యోగుల వలసలు ఈ ఏడాది 28.4 శాతంగా నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఐటీ ఇండస్ట్రీలో ఇదే గరిష్టం కావడం విశేషం. విప్రోలో వలసలు 23.3 శాతం కాగా, టెక్‌ మహీంద్రాలో 22 శాతం వలసలు ఉన్నాయి. టీసీఎస్‌ గతేడాది 17.4 శాతం మంది ఉద్యోగులు వలస వెళ్లగా, ఈ ఏడాది 2.3 శాతం మంది అదనంగా బయటకు వెళ్లారు, వలసల శాతం 19.7 గా నమోదైంది. భారత్ లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సంస్థలు ఉద్యోగుల వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. సిబ్బందిని కాపాడుకోలేక సతమతం అవుతున్నాయి. సీనియర్లు వెళ్లిపోతుండటంతో.. కొత్తగా సిబ్బందిని రిక్రూట్‌ చేసుకునే పనిలో పడ్డాయి కంపెనీలు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో సంస్థలు 50 వేల మంది సిబ్బందిని కొత్తగా నియమించుకున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

రెండేళ్లకే జంప్..

కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉండటంతో ఉద్యోగులు ఊరట చెందారు. తిరిగి ఆఫీస్ లకు రమ్మని చెబుతున్నా కుదరదు పొమ్మంటున్నారు. ఈ అవకాశం ఇచ్చే కంపెనీల్లోనే పనిచేస్తామంటు తేల్చి చెబుతున్నారు. ఇంటి దగ్గర ఉండి పని చేస్తూ ప్రైవేటుగా మరికొన్ని ప్రాజెక్ట్ లను ఒప్పుకొంటూ ఉద్యోగులు గరిష్ట సమయాన్ని పనికోసమే వెచ్చిస్తున్నారు. ఈ దశలో పనిచేస్తున్న సంస్థ కంటే వేతనాన్నే సిబ్బంది ప్రామాణికంగా తీసుకుంటున్నారు. దీంతో వలసలు భారీగా పెరిగాయి. సీనియర్లు రెండేళ్లకే కంపెనీ మారిపోతున్నారు. టాలెంట్ ఉన్నవారికి డిమాండ్ ఎక్కువగా ఉండటం, కంపెనీలు కూడా వారికి ప్రయారిటీ ఇవ్వడంతో సీనియర్లు, ప్రతిభ ఉన్నవారు అత్యథిక వేతనాలు ఆఫర్ చేసే కంపెనీలను ఎంపిక చేసుకుంటున్నారు.

జీతాల విషయంలో కంపెనీల మల్లగుల్లాలు..

సీనియర్లకు వేతనాలు పెంచే విషయంలో వివిధ కంపెనీలు ఇబ్బంది పడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. వేతనాల పెంపు విషయంలో టైమ్ ఎక్కువ తీసుకుంటున్నాయి. అలవెన్స్‌ లు, ఇతర ఖర్చులను కట్‌ చేశాయి. వేరియబుల్‌ పేమెంట్స్ లో భారీగా కోతలు పెట్టాయి. దీంతో సహజంగానే ఉద్యోగులు కంపెనీ మారడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ప్రతి ఏడాదీ లక్షల్లో బయటకు వస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు కంపెనీలకు వరంగా మారారు. దీంతో ఐటీ కంపెనీల్లో వలసలు, కొత్త రిక్రూట్ మెంట్లు పెరిగాయి.

Tags:    
Advertisement

Similar News