టీమ్ కష్టంతో వరల్డ్ కప్ వస్తే.. అతడొక్కడినే హీరోని చేశారు.. ధోనీపై గంభీర్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈ రెండు వరల్డ్ కప్ లలో జట్టును ఫైనల్ కు చేర్చింది యూవీనే. కానీ పీఆర్ ఏజెన్సీ బృందాలు మాత్రం రెండు వరల్డ్ కప్ లు ధోనీ వల్లే వచ్చినట్లుగా ప్రచారం చేసి అతడిని హీరోని చేశాయి

Advertisement
Update: 2023-06-13 06:51 GMT

మహమ్మద్ అజారుద్దీన్, సౌరభ్ గంగూలీ తర్వాత భారత క్రికెట్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ పేరు తెచ్చుకున్నాడు. అతడి కెప్టెన్సీలోనే భారత జట్టుకు వన్డే వరల్డ్ కప్, టీ-20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలు దక్కాయి. అయితే ఇటీవల టీమిండియా డబ్ల్యూటీసీ టెస్ట్ ఫైనల్ కి వెళ్లి ఘోర పరాజయం మూట‌గ‌ట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మాత్రమే కాదు గత ఏడాది కూడా ఫైనల్ వరకు వెళ్లి టీమిండియా చతికిలపడింది.

దీంతో ఐసీసీ టోర్నమెంట్లను గెలవడం ఒక్క ధోనీ వల్లే సాధ్యం అంటూ సోషల్ మీడియా వేదికగా క్రికెట్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ పోస్టులపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ధోనీపై ఘాటు విమర్శలు చేశాడు. వన్డే వరల్డ్ కప్, టీ-20 వరల్డ్ కప్ లలో జట్టు మొత్తం సమష్టిగా ఆడి విజయాలు సాధిస్తే.. ధోనీ ఒక్కడే అన్ని మ్యాచ్ లలో రాణించి విజయాలు అందించినట్లు ప్రచారం చేశారని, అతడిని హీరోని చేశారని మండిపడ్డాడు.

'ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా వరుసగా విఫలం అవుతోంది. దానికి కారణం ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనకు ఇస్తున్న ప్రాధాన్యం కంటే జట్టు ప్రదర్శనకు ఇవ్వకపోవడమే. ఇతర జట్లు మాత్రం సమష్టి ప్రదర్శనకు పెద్దపీట వేస్తున్నాయి. 2007 టీ-20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లో భారత్ విజయానికి కారణం ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. ఈ రెండు వరల్డ్ కప్ లలో జట్టును ఫైనల్ కు చేర్చింది యూవీనే. కానీ పీఆర్ ఏజెన్సీ బృందాలు మాత్రం రెండు వరల్డ్ కప్ లు ధోనీ వల్లే వచ్చినట్లుగా ప్రచారం చేసి అతడిని హీరోని చేశాయి' అని గంభీర్ కామెంట్స్ చేశాడు. గంభీర్ చేసిన ఈ వివాదాస్పద కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ మారాయి.

నిజానికి 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సచిన్, సెహ్వాగ్ వంటి టాప్ ఆటగాళ్లు వెనుదిరిగినా గౌతమ్ గంభీర్ మాత్రం కడదాకా పోరాడి 97 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫైనల్ లో జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే చివర్లో ధోనీ సిక్స్ కొట్టి వరల్డ్ కప్ అందించడంతో అతడికే ఎక్కువగా పేరు వచ్చింది. అప్పట్నుంచి ధోనీని టార్గెట్ చేసి ఏదో ఒక విమర్శలు చేస్తూ వచ్చిన గంభీర్ ఇప్పుడు మరోసారి ధోనీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశాడు.

Tags:    
Advertisement

Similar News