మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళిసై.. బీజేపీలో రీ-జాయిన్

తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళి సై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.

Advertisement
Update: 2024-03-20 11:27 GMT

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగుతూ వచ్చిన ఆమె ఇటీవ‌ల రెండు పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళి సై ఇవాళ తిరిగి బీజేపీలో చేరారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టకు ముందు తమిళిసై తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్లుగా కొనసాగారు. బీజేపీలో అంచలంచెలు ఎదిగి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు.

2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తమిళి సై దక్షిణ చెన్నై పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అనంతరం తమిళి సైని కేంద్రం తెలంగాణ గవర్నర్ గా నియమించింది. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆమె బాధ్యతలు చేపట్టారు. తమిళి సై గవర్నర్ గా కొనసాగుతున్నప్పటికీ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉందని పలుసార్లు ప్రస్తావించారు.

ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళి సై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి ఆమె సెంట్రల్ చెన్నై ఎంపీ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళి సై రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో సీపీ రాధాకృష్ణన్ రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

Tags:    
Advertisement

Similar News