ఉల్లి ఎగుమతులపై నిషేధం

ఉల్లిపాయలు చాలా రోజులుగా అధిక ధరలు పలుకుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలకు ఇది మోయలేని భారంగా మారింది.

Advertisement
Update: 2023-12-08 08:43 GMT

ఉల్లిపాయల ధరలు మండిపోతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిబంధన తక్షణం అమలులోకి వస్తుందని ప్రకటించింది. నేటి నుంచే ఈ నిషేధం అమల్లో ఉంటుంది. 2024 మార్చి 31 వరకు ఈ నిబంధ‌న కొనసాగుతుంది. ఈ మేరకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లిపాయలను అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

దేశంలో ఉల్లిపాయలు చాలా రోజులుగా అధిక ధరలు పలుకుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర రూ.50 పైనే పలుకుతోంది. దీంతో సామాన్య ప్రజలకు ఇది మోయలేని భారంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వీటి ధరల కట్టడికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇందులో కొన్ని మినహాయింపులు కల్పించింది. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఓడల్లో లోడైన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్‌కు అప్పగించిన ఉల్లి లోడును ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Tags:    
Advertisement

Similar News