బజరంగ్ దళ్ వివాదం.. పరువు నష్టం కేసులో ఖర్గేకు కోర్టు సమన్లు

బజరంగ్ దళ్ పరువుకు భంగం కలిగేలా మాట్లాడిన ఖర్గే రూ. 100 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని సంగ్రూర్ కోర్టులో బజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు హితేష్ భరద్వాజ్ ఓ పిటిషన్ దాఖలు చేశాడు.

Advertisement
Update: 2023-05-15 09:52 GMT

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ని నిషేధిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి. దీనికి సంబంధించి పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ కోర్టులో ఖర్గేపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఇవాళ ఖర్గేకు కోర్టు సమన్లు జారీ చేసింది. కర్ణాటకలో ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ బజరంగ్ దళ్ ని పీఎఫ్ఐ, సిమి వంటి ఉగ్రవాద సంస్థలతో పోల్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ని నిషేధిస్తామని ప్రకటించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని కూడా చేర్చింది.

అయితే ఇది కర్ణాటకలో తీవ్ర వివాదాస్పదం అయ్యింది. బజరంగ్ దళ్, పలు హిందూ సంఘాలు ఈ విషయమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బజరంగ్ దళ్ ని నిషేధిస్తామని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆ సంస్థ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ విషయం వివాదంగా మారుతుండడంతో కాంగ్రెస్ కూడా వెనక్కు తగ్గింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ పై నిషేధం ఉండదని ప్రకటించింది.

ఇదిలా ఉంటే బజరంగ్ దళ్ పరువుకు భంగం కలిగేలా మాట్లాడిన ఖర్గే రూ. 100 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని సంగ్రూర్ కోర్టులో బజరంగ్ దళ్ హింద్ వ్యవస్థాపకుడు హితేష్ భరద్వాజ్ ఓ పిటిషన్ దాఖలు చేశాడు. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఖర్గేకు సమన్లు జారీ చేసింది. జూలై 10వ తేదీన కోర్టుకు హాజరు కావాలంటూ సివిల్ జడ్జి రమణ్ దీప్ కౌర్ ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News