సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

2002 గుజరాత్ అల్లర్ల తర్వాత ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై జూన్ నుండి జైలులో ఉన్న ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టులో ఆమె రెగ్యుల‌ర్ బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది.

Advertisement
Update: 2022-09-02 11:40 GMT

సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు సుప్రీం కోర్టు ఈ రోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై జూన్ నుండి ఆమె జైలులో ఉన్నారు.

హైకోర్టులో ఆమె రెగ్యుల‌ర్ బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఆగస్టు 3న విచారణకు వచ్చిన ఆ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఆరువారాలకు వాయిదా వేసింది. దాంతో ఆమె మధ్యంతర బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై నిన్న విచారణ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ యూయూ లలిత్ పోలీసులపై, హైకోర్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమెపై ఉన్న కేసులు బెయిల్ ఇవ్వకూడనివా అని ఆయన ప్రశ్నించారు. ఓ మహిళ అని కూడా చూడకుండా హైకోర్టు ఆరువారాలపాటు విచారణ వాయిదా వేయడం ఎలా సమర్దించుకోగలదు అని ఆయన అన్నారు. రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న ఆమెపై ఇప్పటి వరకు కనీసం చార్జ్ షీట్ కూడా దాఖలు చేయకపోవడాన్ని జస్టిస్ లలిత్ ఎత్తి చూపారు.

నిన్న చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈ రోజు జస్టిస్ లలిత్ తో కూడిన ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.

ఆమె పాస్‌పోర్ట్‌ను సమర్పించడం వంటి బెయిల్ ఫార్మాలిటీల తర్వాత సెతల్వాద్ విడుదల చేయబడతారు. దీని కోసం ఆమెను "సాధ్యమైనంత త్వరగా సంబంధిత కోర్టు ముందు హాజరుపరచాలి" అని సుప్రీం కోర్టు బెంచ్ తీర్పు చెప్పింది, ఆమె దర్యాప్తుకు సహకరించాలని పేర్కొంది.

Tags:    
Advertisement

Similar News