ఆమ్‌ ఆద్మీ ఎంపీపై ఫోర్జరీ ఆరోపణలు..

ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కోరుతూ రాఘవ్ ఛద్దా రాజ్యసభకు సమర్పించిన తీర్మానంపై కొందరు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

Advertisement
Update: 2023-08-08 08:28 GMT

ఆమ్‌ ఆద్మీ ఎంపీ రాఘవ్‌ ఛద్దా వివాదంలో చిక్కుకున్నారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కోరుతూ రాఘవ్ ఛద్దా రాజ్యసభకు సమర్పించిన తీర్మానంపై కొందరు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న కోరుతూ సమర్పించిన తీర్మానంపై తమ సంతకాలను చద్దా ఫోర్జరీ చేశారని అయిదుగురు ఎంపీలు ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రాఘవ్‌ ఛద్దాపై కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. తీర్మానంపై తమ సంతకాలను ఛద్దా ఫోర్జరీ చేశారని ఎంపీలు ఆరోపించారు. అనుమతి లేకుండా తమ పేర్లను ఢిల్లీ ప్రతిపాదిత సెలక్ట్‌ కమిటీలో చేర్చారని బీజేపీ ఎంపీలు ఎస్ ఫంగ్నోన్ కొన్యక్, నరహరి అమిన్, సుధాంశు త్రివేది, ఏఐఏడీఎంకే ఎంపీ ఎం తంబిదురై, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రాలు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు.

ఒకవేళ నిజంగా ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. ఇందుకు బాధ్యుడైన రాఘవ్‌ ఛద్దాపై తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రులు డిమాండ్ చేశారు.

పార్లమెంటులోనే ఫోర్జరీకి పాల్పడినట్లు తెలియడం చాలా అవమానకరమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు.

అయితే ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. అసలు పద్ధతి ప్రకారం ఒక బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపించాలని ప్రతిపాదిస్తే దానిపై అసలు ఎలాంటి సంతకాలు అవసరం లేదని గుర్తు చేసింది. ఒక వేళ ఆ కమిటీలో భాగం కావాలన్నప్పుడు మాత్రమే ఆ సభ్యుని సమ్మతి అవసరమని, అసలు ఇందులో సంతకాలే లేనప్పుడు ఫోర్జరీ ఎక్కడ జరిగిందని ప్రశ్నించింది.

Tags:    
Advertisement

Similar News