వెనక్కు నడవండి... ఎన్నో ఆరోగ్యలాభాలు పొందండి

నడక ఆరోగ్యానికి చాలామంచిదని మనందరికీ తెలుసు. అయితే ముందుకు కాకుండా వెనక్కు నడవటం వలన మరిన్ని లాభాలున్నాయని పరిశోధనల్లో తేలింది.

Advertisement
Update: 2023-08-23 14:20 GMT

నడక ఆరోగ్యానికి చాలామంచిదని మనందరికీ తెలుసు. అయితే ముందుకు కాకుండా వెనక్కు నడవటం వలన మరిన్ని లాభాలున్నాయని పరిశోధనల్లో తేలింది. అలా వెనక్కు నడవడాన్ని రెట్రో వాకింగ్ అంటారు. ఇలా నడవటం కాస్త కష్టమే. చూసేవారికి కూడా విచిత్రంగా కనబడుతుంది. అయితే నిదానంగా సాధన చేసి దీనిని మన వ్యాయామంలో భాగం చేసుకోవటం ద్వారా అద్భుతమైన లాభాలను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

♦ వెనక్కు నడవటం వలన తొడకు ముందు భాగంలో ఉండి మోకాళ్ల కీళ్లకు ఆసరాగా మారే కండరాలకు బలం చేకూరుతుంది. దీనివలన మోకాళ్లకు సంబంధించిన నొప్పులు తగ్గుతాయి.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అనే పత్రికలో ప్రచురితమైన ఓ అధ్యయన ఫలితాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. గత ఏడాది ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

♦ సాధారణ నడకతో పోల్చినప్పుడు వెనక్కు నడిచే నడక ఎక్కువ కండరాలను వినియోగించుకుంటుంది. దీనివలన శరీరంలో సమతౌల్యం, సమన్వయ నైపుణ్యాలు పెరుగుతాయి. వెనక్కు నడవడానికి చాలా ఏకాగ్రత కావాలి.

♦ వెనక్కు నడవటం వలన మెదడులోని సెరిబెల్లమ్ అనే భాగం ఉత్తేజితమవుతుంది. ఇది మన మెదడు నిర్వహించే మోటార్ కంట్రోల్ పనికి బాధ్యత వహిస్తుంది. మోటార్ కంట్రోల్ అంటే... ఉదాహరణకు చేతివేళ్లతో నేలపైన ఉన్న అతి సన్నని వస్తువులను తీయడం లాంటి సామర్ధ్యాలు. ఇలాంటి పనులను నిర్వహించే సామర్ధ్యాన్ని ఫైన్ మోటార్ కంట్రోల్ అంటారు.

♦ వెనక్కు నడిచినప్పుడు మనం చిన్న అడుగులను వేగంగా వేస్తుంటాం. దీనివలన మోకాళ్లకు కింది భాగంలో ఉండే కండరాలు శక్తిమంతం అవుతాయి. ముందుకు నడిస్తే వేగంగా నడవగలం. అయితే వెనక్కు నడిచినప్పుడు అలా నడవలేం కనుక.. చిన్నపాటి అడుగులు వేస్తాం. అలా నడిచినా మంచిదేనని వైద్యులు సూచిస్తున్నారు.

♦ సాధారణ నడకతో పాటు వెనక్కు కూడా నడవటం వలన గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం కిందభాగం శక్తిమంతమవుతుంది. మామూలు నడకకోసం కంటే వెనక్కు నడవడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దాంతో వెనక్కు నడవటం వలన ఎక్కువ కేలరీలు ఖర్చయి బరువు తగ్గే అవకాశం పెరుగుతుంది.

♦ వెనక్కు నడవటం వలన శారీరక ఆకృతి కూడా బాగుంటుంది. వెన్ను వంగిపోయి ముందు కు వంగినట్టుగా కనిపించడం, అలాగే నడవటం లాంటి సమస్యలు తగ్గుతాయి. మనం చాలా పనులను ముందుకు వంగి చేస్తుంటాం. దీనివలన మన శరీర ఆకృతి దెబ్బతింటుంది. వెనక్కు నడిచే నడక దానిని నివారిస్తుంది.

♦ వెనక్కు నడిస్తే శరీరంలో బ్యాలన్స్, సమన్వయం పెరుగుతాయి. పెద్దవయసువారిలో ఏకాగ్రత, శారీరక కదలికల చురుకుదనం మెరుగవుతాయి. ముఖ్యంగా పెద్దవయసువారు వెనక్కు నడవటం చాలా మంచిది. దీనివలన వీరిలో వయసు పెరగటం వలన వచ్చే శారీరక సమస్యలు తగ్గుతాయి. వయసు పెరుగుతున్నా శక్తిమంతంగా ఉండగలుగుతారు. అయితే ఈ నడకవలన కిందపడకుండా, దెబ్బలు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

♦ వెనక్కు నడవటం మెదడుకి ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. దీని వలన నాడీకణాల సామర్ధ్యం పెరిగి ఆలోచనాసామర్ధ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.

Tags:    
Advertisement

Similar News