అపవిత్ర కలయిక.. అప్పుడే ఉడుక్కుంటే ఎలా..?

పొత్తులపై చర్చలు జరిగాయని, వారి ముసుగు తొలగిపోయిందని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. అదొక అపవిత్ర కలయిక అన్నారు. వారి కలయిక వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు.

Advertisement
Update: 2023-01-08 07:52 GMT

సింహం సింగిల్ గా వస్తుంది.. పొత్తుల విషయంలో వైసీపీ నేతలు పదే పదే చెప్పే డైలాగ్ ఇది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోదనేది వారి మాటల సారాంశం. మిగతా వారంతా కట్టకట్టుకుని వచ్చినా, కలసి వచ్చినా.. అందర్నీ జగన్ కలేసి కుమ్మేస్తాడని అంటుంటారు వైసీపీ నేతలు. పోనీ వారు చెప్పిందే నిజమనుకుందాం.. జగన్ అంతటి సమర్థుడయినప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే తప్పేంటి..? రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. ఆ మాటకొస్తే జగన్, బీజేపీతో సఖ్యతగా ఉండటం దేనికి సంకేతం. కలసి పోటీ చేయరు కానీ మిగతా విషయాలన్నిట్లో బీజేపీకి ఏపీలో వైసీపీ బి-టీమ్ గానే వ్యవహరిస్తోంది. దీనిపై ఎవరు కామెంట్ చేసినా, గతంలో మీరు చేసిందేంటి అనే ప్రశ్న మాత్రమే వినిపిస్తుంది.

తాజాగా పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇంటికి వెళ్లారనగానే వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. లోపల ఏం చర్చలు జరిగాయి, ఏమేం మాట్లాడుకున్నారు అనే విషయాలపై ఎవరికీ క్లారిటీ రాకముందే పొత్తులపై చర్చలు జరిగాయని, వారి ముసుగు తొలగిపోయిందని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. అదొక అపవిత్ర కలయిక అన్నారు. వారి కలయిక వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు విష్ణు.

చర్చ దాని గురించేనా..?

తాజా భేటీతో పవన్, చంద్రబాబుల ముసుగు పూర్తిగా తొలగిపోయిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో కాకుండా.. పక్క రాష్ట్రంలో కూర్చొని జీవో నెంబర్-1 పై చర్చించడమేంటని ప్రశ్నించారు. జీవో నెంబర్-1 పై చర్చించేందుకు హైదరాబాద్‌ లో సమావేశం కావడం హాస్యాస్పదని ఎద్దేవా చేశారు. పవన్‌ కు ఒక స్టాండ్ అంటూ లేదని.. ప్యాకేజీకి లొంగిపోయాడు కాబట్టే చంద్రబాబు ఇంటికి వెళ్లాడని అభిప్రాయపడ్డారు. కచ్చితంగా ప్యాకేజీని కుదుర్చుకోవడానికే చంద్రబాబుని పవన్ కలిశాడని విమర్శించారు. ఆ ఇద్దరు ప్రజల గురించి కాకుండా, కేవలం తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే కలుస్తున్నారని అన్నారు. వాళ్లిద్దరు ఏనాడూ ప్రజలకోసం ఫలానా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండని చెప్పిన దాఖలాలు లేవని, కేవలం రాజకీయ దురద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ ప్రజాసంక్షేమం గురించి ఆలోచించే వ్యక్తులు కాదన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం కుట్ర పన్నేందుకు పవన్, చంద్రబాబు కలిశారని ఆరోపించారు.

చంద్రబాబు బలం 23మంది ఎమ్మెల్యేలు, వారిలో కొందరు చేజారిపోయారు కూడా. పవన్ కల్యాణ్ కి ప్రస్తుతం ఎమ్మెల్యేల బలమే లేదు. అలాంటిది వీరిద్దరూ కలసి ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర చేయగలరా..? చేసినా అది సాధ్యమవుతుందా.. ? ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం మాదే అని చెప్పుకునే వైసీపీ నేతలు, ఈరోజు భేటీతో ఎందుకంత ఉడుక్కుంటున్నారు, భుజాలు తడుముకోవడం దేనికి సంకేతం..

Tags:    
Advertisement

Similar News