మాధవ్ ని పార్లమెంట్ నుంచి బహిష్కరించాలి - రాష్ట్రపతికి ఫిర్యాదు..

డిగ్నిటీ ఫర్ ఉమెన్ అనే పేరుతో వీరు ఉద్యమం మొదలు పెట్టారు. మహిళా సంఘాల ప్రతినిధులు, టీడీపీ నాయకులు.. ఈ మేరకు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. మాధవ్ ని వెంటనే చట్టసభలనుంచి బహిష్కరించాలని కోరారు.

Advertisement
Update: 2022-08-24 02:22 GMT

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాజ్ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు చేరింది. మాధవ్ ని వెంటనే చట్టసభల నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలసి వినతిపత్రం అందించారు మహిళా ఐక్య కార్యాచరణ సమితి నేతలు. డిగ్నిటీ ఫర్ ఉమెన్ అనే పేరుతో వీరు ఉద్యమం మొదలు పెట్టారు. మహిళా సంఘాల ప్రతినిధులు, టీడీపీ నాయకులు.. ఈ మేరకు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. మాధవ్ ని వెంటనే చట్టసభలనుంచి బహిష్కరించాలని కోరారు.

అందుకే ఢిల్లీకి వచ్చాం..

ఈ వ్యవహారం ఏపీలో తేలకపోవడంతో ఢిల్లీకి వచ్చామని చెబుతున్నారు మహిళా సంఘాల నేతలు. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై ఏపీ డీజీపీకి, గవర్నర్‌ కు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదని అన్నారు. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అందుకే తామంతా ఢిల్లీకి రావాల్సి వచ్చిందని చెప్పారు. ఎంపీ మాధవ్‌ పై రేప్ కేసు కొనసాగుతోందని, అలాంటి వ్యక్తిని ఇంకా ఎంపీగా ఎలా కొనసాగిస్తారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం గోరంట్ల మాధవ్‌ ను రక్షించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అతడిపై చర్యలకు వెనకాడుతోందన్నారు.

జాతీయ మహిళా కమిషన్ కి ఫిర్యాదు..

రాష్ట్రపతితోపాటు జాతీయ మహిళా కమిషన్ ని కూడా కలసిన నేతలు గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ వీడియోని మార్ఫింగ్ అని నిరూపించేందుకు వైసీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, అధికారులతో కూడా అసత్యాలు పలికిస్తున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లూ లేఖలతోనే ఢిల్లీకి సమాచారం చేరవేసిన ఏపీ నేతలు, ఇప్పుడు నేరుగా ఢిల్లీలో మకాం పెట్టారు. గోరంట్ల మాధవ్ వ్యవహారంపై తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు. ఎస్పీ ప్రెస్మీట్, సీఐడీ చీఫ్ వివరణ తర్వాత ఈ వ్యవహారం సద్దుమణుగుతుంది అనుకున్నా.. ఏపీ మహిళా నేతలు నేరుగా ఢిల్లీలోనే తేల్చుకుంటామంటున్నారు. ఈ విషయాన్ని వదిలిపెట్టేలా లేరు.

Tags:    
Advertisement

Similar News