ఎమ్మెల్యేని ఓడించాలని తీర్మానం చేశారా?

ఎమ్మెల్యే బాధితులంతా కలిసి మీటింగ్ పెట్టుకుని ఒక తీర్మానం చేసి జగన్‌కు పంపారట. రాబోయే ఎన్నికల్లో సూళ్ళూరుపేట టికెట్ కలివేటి సంజీవయ్యకే ఇస్తే కచ్చితంగా ఓడిస్తామ‌ని..అభ్యర్థిని మారిస్తే పార్టీ ఈజీగా గెలుస్తుందని కూడా చెప్పినట్లు టాక్ నడుస్తోంది.

Advertisement
Update: 2023-04-06 06:10 GMT

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపోటములు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి పైనే ఆధారప‌డి ఉంటాయి. కాబట్టి ఈ నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకం.. ఎందుక‌ని సందేహం రావచ్చు.. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుపతి జిల్లాలోని సూళ్ళూరుపేట నియోజకవర్గంలో రెడ్డి సామాజికవకర్గం చాలా బలంగా ఉంది. అయితే నియోజకవర్గం ఏమో ఎస్సీ రిజర్వుడు. సిట్టింగ్ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య పట్టపగ్గాలు లేకుండా వ్యవహరిస్తున్నారనే గోలపెరిగిపోతోంది. ఈయన ఆగడాలను భరించలేకపోతున్నామని సొంతపార్టీ నేతలే మొత్తుకుంటున్నారు.

అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఒక తీర్మానం చేసి జగన్‌కు పంపారట. తీర్మానంలో ఏముందంటే రాబోయే ఎన్నికల్లో సంజీవయ్యకే టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతాడని. అంటే టీడీపీ బలం పెంచుకుని సంజీవయ్యను ఓడిస్తుందని కాదు అర్థం. సొంతపార్టీ నేతలే సంజీవయ్యను ఓడించటం ఖాయమని చెప్పారట. అభ్యర్థిని మారిస్తే పార్టీ ఈజీగా గెలుస్తుందని కూడా చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అసలు సమస్య ఏమిటంటే తనకు వ్యతిరేకంగా ఎవరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా పోలీసులతో చెప్పి ఎమ్మెల్యే చావగొట్టిస్తున్నారట.

ఈమధ్యనే పార్టీ వీరాభిమాని బాబురెడ్డి సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ఎలా నడుచుకోవాలో చెప్పాడు. నిజానికి ఆ పోస్టింగ్‌లో తప్పు కానీ అసభ్యతకానీ ఏమీలేదు. అయినా దాన్ని సహించలేని సంజీవయ్య పోలీసులతో చెప్పి చచ్చేట్లు కొట్టించ్చారట. ఇదివరకు కూడా చాలామందిని ఎమ్మెల్యే ఇలాగే పోలీసులను అడ్డుపెట్టుకుని బాగా ఇబ్బందిపెట్టాడని సమాచారం.

ఇలా ఒక బాధితుడికి మరో బాధితుడు తోడవ్వటంతో చివరకు ఎమ్మెల్యే బాధితులంతా ఏకమై జగన్‌కు ఫిర్యాదు చేసేవ‌ర‌కు పరిస్ధితులు ముదిరిపోయాయి. సంజీవయ్యకే మూడోసారి టికెట్ ఇచ్చి నియోజకవర్గంలో ఓటమికి కారణమవుతారో లేకపోతే అభ్యర్థిని మార్చి గెలిపించుకుంటారా అన్నది ఆసక్తిగా మారింది. సంజీవయ్య వ్యవహారం సూళ్ళూరుపేటలో రచ్చకెక్కినట్లుగానే మడకశిర, నగిరి, హిందుపురం, సత్తెనపల్లి, ఆలూరు లాంటి నియోజకవర్గాల్లో అంతర్గత గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరి జగన్ వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News