జగన్ మూడంచెల వ్యూహం ఫలిస్తుందా?

ఇద్దరి సర్వే రిపోర్టుల్లోను రూరల్ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలంగా ఉందనే సమాచారం స్పష్టంగా కనబడుతోందట. అందుకనే జగన్ ఎక్కువగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలపైనే పెట్టాలని డిసైడ్ అయ్యారట.

Advertisement
Update: 2023-02-28 06:14 GMT

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇటు జగన్మోహన్ రెడ్డి అటు చంద్రబాబునాయుడు అనేక వ్యూహాలు రచిస్తున్నారు. జననాడిని తెలుసుకోవటం కోసం ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఇద్దరూ వ్యూహకర్తలను నియమించుకున్నారు. పార్టీ నేతల ద్వారా కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. జగన్ చేయించుకుంటున్న సర్వేల్లో అంతా బాగానే ఉందనే ఫీల్ గుడ్ రిపోర్టు వస్తోంది. ఇదే సమయంలో చంద్రబాబు సర్వేల్లో టీడీపీకే బ్రహ్మాండమనే ఫీడ్ బ్యాక్ వస్తోంది.

అయితే ఇక్కడే చిన్న తేడా ఉందని సమాచారం. ఇద్దరి సర్వే రిపోర్టుల్లోను రూరల్ ప్రాంతాల్లో వైసీపీ చాలా బలంగా ఉందనే సమాచారం స్పష్టంగా కనబడుతోందట. అందుకనే జగన్ ఎక్కువగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలపైనే పెట్టాలని డిసైడ్ అయ్యారట. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో అత్యధిక లబ్ధిదారులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. నవరత్నాల్లో లబ్ధిదారులు కావచ్చు లేదా పెన్షన్ అందుకుంటున్నవాళ్ళూ కావచ్చు. కొత్తగా జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు కూడా తోడవచ్చు.

ఇలా ఏ విధంగా చూసినా గ్రామీణ ప్రాంతాల్లో జనాలే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలిందట. అందుకనే జగన్ అంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే బాగా సానుకూలంగా ఉన్నారు. కాబట్టి జగన్ కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నియోజకవర్గాల్లోని ఓటర్లపైనే ఆధారపడినట్లున్నారు. 175 నియోజకవర్గాల్లో దాదాపు 110 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నాయి. పూర్తి అర్బన్ నియోజకవర్గాల సంఖ్య సుమారు 40 ఉన్నాయట. సెమీఅర్బన్+ సెమీగ్రామీణ వాతావరణం కలిసుండే నియోజకవర్గాలు 25 అని లెక్క తేలిందట.

కాబట్టి మొదటి 110 నియోజకవర్గాలతో పాటు మూడో రకమైన 25 నియోజకవర్గాలపైన గనుక పూర్తి దృష్టిపెడితే మంచి ఫలితాలు ఉంటాయని జగన్‌కు ఫీడ్ బ్యాక్ అందిందని పార్టీ వర్గాల సమాచారం. మధ్యలోని 40 నియోజకవర్గాలు ఎక్కువగా జిల్లాల కేంద్రాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోని నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. కాబట్టి జగన్ మూడెంచల వ్యూహంతో వెళ్ళబోతున్నట్లు స్పష్టంగా అర్థ‌మవుతోంది. మరి ఫలితాలు ఎలాగుంటాయో చూడాలి.

Tags:    
Advertisement

Similar News