ఏపీలో ప్రచారానికి దూరంగా బీజేపీ సీనియర్లు

సీనియర్లకు సీటు దక్కకపోవడానికి ప్రధాన కారణం పురందేశ్వరేనని అందరూ మండిపడుతున్నారు. సీనియర్లను కాదని, టీడీపీతో అంటకాగిన పురందేశ్వరి.. టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకొని మరీ టిక్కెట్లు ఇప్పించడంపై వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Advertisement
Update: 2024-05-03 06:23 GMT

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ సీనియర్‌ నేతలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వైఖరే అందుకు కారణమని తెలుస్తోంది. ఏపీ బీజేపీలోని పలువురు సీనియర్‌ నేతలు ప్రస్తుత ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించినప్పటికీ వారికి భంగపాటే ఎదురైంది. తొలి నుంచి పార్టీ కోసం పనిచేసినవారిని పక్కనపెట్టి.. ఆ స్థానంలో టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకొని వారికి టిక్కెట్లు కేటాయించడంపై నేతలు తీవ్ర మనస్తాపానికి గురైన విషయం తెలిసిందే.

విశాఖపట్నం ఎంపీ సీటు కోసం జీవీఎల్‌ నరసింహారావు ప్రయత్నించినా ఆయనకు టిక్కెట్‌ దక్కకపోవడం తెలిసిందే. అలాగే రాజమండ్రి టిక్కెట్‌ను ఆశించిన సోము వీర్రాజుకు కూడా ఆశాభంగమే ఎదురైంది. ఇక ఏలూరులో తనకు ఎంపీ సీటు కచ్చితంగా ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న తపన చౌదరికి కూడా చుక్కెదురైంది. ఇదేవిధంగా పలువురు సీనియర్లు కూడా సీటు ఆశించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో పొత్తులో భాగంగా 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లు పొందినప్పటికీ సీనియర్లకు మాత్రం చాన్స్‌ దక్కకపోవడం గమనార్హం.

సీనియర్లకు సీటు దక్కకపోవడానికి ప్రధాన కారణం పురందేశ్వరేనని అందరూ మండిపడుతున్నారు. సీనియర్లను కాదని, టీడీపీతో అంటకాగిన పురందేశ్వరి.. టీడీపీ నేతలను పార్టీలో చేర్చుకొని మరీ టిక్కెట్లు ఇప్పించడంపై వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్లంతా పార్టీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అగ్ర నేతలు వచ్చిన సందర్భాల్లోనే అదీ మొక్కుబడిగా హాజరై మమ అనిపిస్తున్నారు. ఇది మొత్తంగా చూస్తే పార్టీకి కచ్చితంగా నష్టం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News