జగన్ వ్యతిరేకులకు 'ఆహా' వేదికవుతోందా?

అన్‌స్టాప‌బుల్ సెకండ్ సీజన్లో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నవారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు జగన్‌ను ఏమీ అనకపోయినా సెల్ఫ్ ప్రమోషన్ అయితే జరుగుతోంది.

Advertisement
Update: 2022-12-28 05:40 GMT

క్షేత్ర స్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇలాగే అనిపిస్తోంది. తొందరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆహా చానెల్లో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంలో ఇంటర్వ్యూ ప్రసారమవుతోంది. ఈ మధ్యనే చంద్రబాబునాయుడుతో ఇంటర్వ్యూ ప్రసారమైంది. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, మోహన్ బాబుతో కూడా ఇంటర్వ్యూలను ప్రసారం చేశారు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తిగా సినీ సెలబ్రిటీలు, ప్రముఖులకు మాత్రమే పరిమితమైంది.

తన సహజ ధోరణికి భిన్నంగా నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ చేస్తున్నఈ ప్రోగ్రామ్‌కు కాస్త పేరొచ్చింది. అయితే సెకండ్ సీజన్లో మాత్రం ఎక్కువగా రాజకీయ వాసనలే కనబడుతున్నాయి. ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నవారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు జగన్‌ను ఏమీ అనకపోయినా సెల్ఫ్ ప్రమోషన్ అయితే జరుగుతోంది. చంద్రబాబు ఇంటర్వ్యూలో జరిగిందిదే. దశాబ్దాలుగా తనపై ముద్రపడిపోయిన వెన్నుపోటు బ్రాండ్‌ను చెరిపేసుకోవటానికి చంద్రబాబు నానా తంటాలుపడ్డారు. దానికి బాలయ్య కూడా సహకరించారు.

పవన్‌తో ఇంటర్వ్యూలో కూడా కచ్చితంగా సెల్ఫ్ ప్రమోషన్ ఉంటుందనటంలో సందేహం లేదు. ఇంటర్వ్యూల్లో చంద్రబాబు అయినా పవన్ అయినా నిజాలే చెబుతున్నారా లేదా అన్నది జనాలు బాగా అర్ధం చేసుకోగలరు. అయినా కానీ ఆహా మాత్రం జగన్ వ్యతిరేకులకు వేదిక అవుతోందనే ప్రచారం పెరిగిపోతోంది.

జగన్ వ్యతిరేకులకు వేదికవ్వటం అంటే జగన్‌ను తిట్టాల్సిన అవసరమే లేదు. తమను తాము బ్రహ్మాండంగా పాజిటివ్‌గా ప్రొజెక్టు చేసుకోవటం కూడా రాజకీయ ప్రచారమే అవుతుంది కదా. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తుండటం, పార్టీలన్నీ జగన్‌కు వ్యతిరేకంగా జట్టుకట్టాలని ఆలోచిస్తున్న నేపధ్యంలో ఏ చిన్న డెవలప్మెంట్ జరిగినా అదిపెద్ద సంచలనమే అవుతుంది. తొందరలో ప్రసారమవబోయే పవన్ ఇంటర్వ్యూనే దీనికి ఉదాహరణ. 2014 కూటమిని ఎందుకు రిపీట్ చేయకూడదు? టీడీపీతో పొత్తు, ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకోవటం లాంటి ప్రశ్నలున్నాయని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. మరిది నిజమా కాదా అనేది చానల్ అధికారికంగా విడుదల చేసే ప్రోమోలను చూస్తే కానీ తెలీదు.

Tags:    
Advertisement

Similar News