బ్లేడుకి బ్రేక్.. తిరుమలలో క్షురకుల ఆందోళన

టీటీడీ ఇచ్చే డబ్బులతో తమకు పూటగడవడం లేదని అంటున్నారు క్షురకులు. స్వామివారి భక్తులు ఇచ్చే తృణమో పణమో తీసుకోవడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Update: 2022-10-27 09:27 GMT

తిరుమలలో ఈ రోజు ఉదయం ప్రధాన కల్యాణ కట్ట వద్ద క్షురకులు ఆందోళనకు దిగారు. పర్మినెంట్ ఉద్యోగులు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారు. పీస్ రేట్ క్షురకులు మాత్రం ఆందోళనలో పాల్గొన్నారు. గుండ్లు గీయడానికి విరామం ప్రకటించే సరికి కల్యాణ కట్టల వద్ద రద్దీ పెరిగింది. టీటీడీ అధికారులు ఆందోళన విరమింపజేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారితో చర్చలు జరుపుతున్నారు.

ఎందుకీ ఆందోళన..?

తిరుమల కల్యాణ కట్టలో తాత్కాలిక ఉద్యోగులకు పీస్ రేట్ ప్రకారం గుండుకి రూ.15 చెల్లిస్తారు. అయితే అలా టీటీడీ ఇచ్చే డబ్బులతో తమకు పూటగడవడం లేదని అంటున్నారు క్షురకులు. స్వామివారి భక్తులు ఇచ్చే తృణమో పణమో తీసుకోవడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. తామెవరినీ బలవంతం చేయడం లేదని, వారు తృప్తిగా ఇస్తేనే తీసుకుంటామని చెబుతున్నారు. ఈ విషయంలో కొంతమంది విజిలెన్స్ సిబ్బంది కావాలని తమపై కక్షగట్టి తనిఖీల పేరుతో ఇబ్బందులపాలు చేస్తున్నారని అంటున్నారు క్షురకులు.

తనిఖీల పేరుతో దుస్తులు తొలగించాలని చెప్పడం సరికాదని అంటున్నారు క్షురకులు. అది తమను అవమానించినట్టేనని ఆరోపిస్తున్నారు. బస్ పాస్ కూడా లేకుండా తిరుపతి నుంచి సొంత డబ్బులతో రోజూ కొండపైకి వచ్చి తాము దేవుడి సేవ చేస్తున్నామని, తమపై అపవాదులు మోపడం సరికాదంటున్నారు. టీటీడీ ఇచ్చే డబ్బులు నెలకు రూ.8 వేలు మించడంలేదని, తమ కుటుంబాలు ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తనిఖీల పేరుతో అధికారులు తమను వేధించడం మానుకోవాలని డిమాండ్ చేస్తూ క్షురకులు కల్యాణ కట్ట వద్ద ఆందోళన చేపట్టారు.

Advertisement

Similar News