తమ్ముళ్ల కుమ్ములాట.. వైసీపీపై చంద్రబాబు నింద

టీడీపీ కార్యక్రమాల్లోకి వైసీపీ శ్రేణులు చొరబడి ఘర్షణలకు పురిగొల్పే ఘటనలు జరుగుతున్నాయని అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణుల్ని హెచ్చరించారు చంద్రబాబు.

Advertisement
Update: 2023-05-17 08:15 GMT

నంద్యాలలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. టీడీపీ లోని రెండు గ్రూపుల కుమ్ములాట అది. అందులో ఓ గ్రూపు లీడర్ భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులు పెట్టుకుంది కూడా టీడీపీ నేతలే. ఇందులో దాపరికమేమీ లేదు, దాయాల్సింది అంతకంటే లేదు. అయితే చంద్రబాబు మాత్రం నింద వైసీపీపై వేసేశారు. టీడీపీ కార్యక్రమాల్లోకి వైసీపీ శ్రేణులు చొరబడి ఘర్షణలకు పురిగొల్పే ఘటనలు జరుగుతున్నాయని అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణుల్ని హెచ్చరించారు చంద్రబాబు. యువగళం యాత్రలో జరిగిన ఘర్షణపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

త్రిసభ్య కమిటీ..

నంద్యాల కుమ్ములాటపై విచారణకోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు చంద్రబాబు. పార్టీ ముఖ్యనేతలతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. సీనియర్లతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. నంద్యాల ఘర్షణ ఘటనపై సమగ్ర అధ్యయనంతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే..?

నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించే సందర్భంలో టీడీపీ లోని ఇరు వర్గాలు గొడవకు దిగాయి. టీడీపీ నేత భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు స్వాగత ఏర్పాట్లు చేశాయి. అయితే ఎవరికి వారే హైలెట్ కావాలనే ఉద్దేశంతో కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి వర్గంలోని ఓ వ్యక్తిని అఖిల ప్రియ వర్గంలోని వారు చితగ్గొట్టారు. రక్త గాయాలతో అతడు ఆస్పత్రిలో చేరారు. పోలీస్ కేసు పెట్టడంతో అఖిల ప్రియ అరెస్ట్ అయ్యారు. తమ్ముళ్ల కుమ్ములాట రాష్ట్రవ్యాప్తంగా హైలెట్ అయింది. టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయని వైసీపీ నుంచి సెటైర్లు పేలుతున్నాయి. దీంతో చంద్రబాబు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు తేల్చాలని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News