అన్నం తినేవాళ్లు ఎవరూ ఇలా మాట్లాడరు

దేశవ్యాప్తంగా భూ వ్యవస్థలో లోపాలను సవరించి, చట్టాలు తేవాలన్న కేంద్ర నిర్ణయంలో భాగంగానే తమ ప్రభుత్వం కూడా అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తోందని, దానికింకా బోలెడంత ప్రాసెస్‌ ఉందని తెలిపారు.

Advertisement
Update: 2024-05-05 05:14 GMT

ప్రజలకు మేలు చేసే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై చంద్రబాబు, పవన్, పచ్చ మీడియాకు ఇంత కడుపు మంట ఎందుకని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ అని ప్రశ్నించారు. అసలు ఈ చట్టంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌కు ఏం తెలుసని నిలదీశారు. అన్నం తినేవాళ్లు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరని, ఇలాంటి రాతలు రాయరని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారిది క్రిమినల్‌ మైండ్‌ అని, అందుకే ఇలాంటి సున్నితమైన సమస్యపై ప్రజల్లో ఆపోహలు సృష్టించి, ఎన్నికల్లో దీన్నొక ఆయుధంగా వాడుకోవాలని చూస్తున్నారని చెప్పారు. విశాఖపట్నంలో శనివారం బొత్స మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా కథనాలు రాయడం పాపం, పెద్ద నేరమని మంత్రి బొత్స చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి ఆస్తి ఎవరు లాక్కోగలరని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్‌ ఫొటో పట్టాదారు పాసుపుస్తకంపై వేస్తే ఆ స్థలం సీఎంకి చెందిపోతుందా? మరి అప్పట్లో మరుగుదొడ్లపై ఎన్టీఆర్‌ బొమ్మ వేశారు కదా. ఆ మరుగుదొడ్లన్నీ ఎన్టీఆర్‌ సొంతమైపోతాయా అని నిలదీశారు. భూవివాదాల్లో అవినీతి, దళారులు, లిటిగెంట్లకు ఆస్కారం లేకుండా చేయడానికే ఈ చట్టాన్ని రూపొందించినట్టు చెప్పారు. ఈ చట్టం రైతు ప్రయోజనాల కోసమే తెచ్చానని సాక్షాత్తూ సీఎం చెప్పారన్నారు. బాధ్యత గల ప్రభుత్వంగా లోపభూయిష్టమైన విధానాలను మార్చి సామాన్యుడికి మేలు చేయడమే తమ లక్ష్యమన్నారు.

దేశవ్యాప్తంగా భూ వ్యవస్థలో లోపాలను సవరించి, చట్టాలు తేవాలన్న కేంద్ర నిర్ణయంలో భాగంగానే తమ ప్రభుత్వం కూడా అన్ని అంశాలనూ అధ్యయనం చేస్తోందని, దానికింకా బోలెడంత ప్రాసెస్‌ ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ చట్టం రాష్ట్రంలో అమల్లో లేదని స్పష్టం చేశారు. ఈ లోపే మీటింగులు పెట్టి.. ఒకరు జోగిపోయి, ఒకరు ఊగిపోయి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాతలు ఎన్నికల వరకేనని అన్నారు. ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికల్లో వారి కూటమికి లాభం చేకూర్చాలన్నదే వీరి దురుద్దేశమని తెలిపారు.

పవన్‌ కళ్యాణ్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని, ఆయనేమన్నా పెద్ద మేధావా అని బొత్స ప్రశ్నించారు. ఎవడైనా రిజిస్ట్రేషన్లలో జిరాక్స్‌ కాపీలు ఇస్తారా? అన్నం తినేవాడు మాట్లాడే మాటలేనా అని మండిపడ్డారు. జిరాక్స్‌ కాపీలు తీసుకోవడానికి ప్రజలు అమాయకులనుకుంటున్నారా, వారు ఒప్పుకొంటారా అని నిలదీశారు. తెలిసీ తెలియని అంశాలపై ఎవరో రాసిస్తే ఊగిపోయి చదివేస్తే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News