పదవి కోసం చంద్రబాబు ఎంతకైనా బరితెగిస్తాడు

దివంగత నేత వైఎస్సార్‌ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను జగన్‌ అమలుచేస్తున్నారని, తిరిగి అధికారంలోకొచ్చి వాటిని కొనసాగించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Update: 2024-05-05 05:05 GMT

చంద్రబాబు పదవి కోసం ఎంతకైనా బరితెగిస్తాడని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. అప్పట్లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎలా మోసం చేశాడో చూశామని గుర్తుచేశారు. అతనికి పదవులే ముఖ్యమని చెప్పారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 1994లో తాను ఎమ్యెల్యేగా పనిచేసినప్పటి నుంచి చూస్తున్నానని.. స్థిరత్వంలేని పదవి కోసం చంద్ర‌బాబు ఎంతకైనా బరితెగిస్తాడని చెప్పారు. చంద్రబాబు పచ్చి మోసగాడని, రాజకీయ లబ్ధి కోసం యూటర్న్‌ తీసుకోవడంలో మొనగాడని విమర్శించారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం చంద్రబాబుకు అస్సలు పట్టదన్నారు.

చంద్రబాబు కేవలం అధికారం చేపట్టడమే లక్ష్యంగా పనిచేస్తాడని ఓవైసీ చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం 1996లో వాజ్‌పేయితో జతకట్టాడని, ఆ తర్వాత బయటకొచ్చాడని, 2014లో మోడీతో కలిసి పనిచేశాడని, మళ్లీ విడిపోయాడని, మోడీని అనరాని మాటలు అన్నాడని, ఇది అందరికీ తెలుసని ఆయన వివరించారు. ఇప్పుడు మళ్లీ మోడీతో కలిసి చంద్రబాబు పనిచేస్తున్నాడని తెలిపారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలా కాదని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తుంటాడని ఓవైసీ చెప్పారు. దివంగత నేత వైఎస్సార్‌ ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లను జగన్‌ అమలుచేస్తున్నారని, తిరిగి అధికారంలోకొచ్చి వాటిని కొనసాగించడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ అంటే ఒక విశ్వాసమని ఈ సందర్భంగా చెప్పారు. అదే చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి హామీ ఇవ్వగలడని ప్రశ్నించారు. ముస్లిం రిజరేషన్లపై చిత్తశుద్ధి ఉంటే.. మోడీ, అమిత్‌ షాతో చెప్పించగలడా? అని నిలదీశారు. అతను మోడీ చేతిలో కీలుబొమ్మ అని.. చంద్రబాబును ఎట్టి పరిస్థితిలోనూ నమ్మలేమని చెప్పారు.

భవిష్యత్తులో ముస్లిం రిజర్వేషన్లకు ముప్పు కలగకుండా చంద్రబాబు, ఆయన కూటమికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పాలని ఓవైసీ పిలుపునిచ్చారు. మరోవైపు.. ప్రధాని మోడీ గ్యారంటీలంటే రాజ్యాంగంలో మార్పులు చేయడం, రిజర్వేషన్లను రద్దుచేయడం, మైనారిటీలకు వ్యతిరేకంగా విషం చిమ్మడమేనని ఆయన ధ్వజమెత్తారు. హిందుత్వమే బీజేపీ ఏకైక అజెండా అని చెప్పారు. భారత్‌ను హిందుత్వ దేశంగా మార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించింది మతప్రాతిపదికన కాదని, సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా అందిస్తున్నారని ఓవైసీ చెప్పారు. ముస్లింలలో అనేక వెనుకబడిన కులాలున్నాయని, వారికి ప్రభుత్వ మద్దతు అవసరమని తెలిపారు. కానీ బీజేపీకి వారి అభివృద్ధి గిట్టడం లేదని, అందుకే... ముస్లిం రిజర్వేషన్ల రద్దుచేస్తామంటున్నారని మండిపడ్డారు.

Tags:    
Advertisement

Similar News