వైఎస్ జగన్ అధికారంలోకి రాకుండా ఆపే దమ్ము వారికే ఉంది.. సజ్జల సంచలన వ్యాఖ్యలు

పవన్ పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తానని, వైఎస్ జగన్‌ను సీఎం కాకుండా ఆపుతానని ప్రగల్బాలు పలుకుతున్నారని సజ్జల అన్నారు.

Advertisement
Update: 2022-12-19 12:00 GMT

'వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను'- గత కొన్నాళ్లుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇదే మాట వల్లెవేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను సీఎం కానివ్వబోమని, వైసీపీని గద్దె దించుతామని మాట్లాడుతున్నారు. ఆదివారం సత్తెనపల్లిలో జరిగిన సభలో కూడా ఇవే విషయాలను మళ్లీ ప్రస్తావించారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు.

పవన్ పదే పదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తానని, వైఎస్ జగన్‌ను సీఎం కాకుండా ఆపుతానని ప్రగల్బాలు పలుకుతున్నారని సజ్జల మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలు అనేవి ప్రజలు నిర్ణయిస్తారని, నాయకుల చేతుల్లో ఏమీ ఉండదని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ మరోసారి సీఎం కాకుండా, వైసీపీ అధికారంలో రాకుండా చూసేది పవన్ కల్యాణ్, చంద్రబాబులు కానే కాదని.. రైతులు, వృద్ధులు, మహిళలు, డ్వాక్రా మహిళలు వద్దనుకుంటే అప్పుడు జగన్ అధికారంలోకి రారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్లకు తప్ప మరే నాయకుడికి జగన్‌ను ఆపే దమ్ము, ధైర్యం లేవని అన్నారు.

పవన్ కల్యాణ్‌లాగా ఏ బాధ్యతా లేకుండా జగన్ ఓట్లు అడగడం లేదు. తాను చేసిన పాలన బాగుంటేనే వైసీపీకి ఓటేయమని కోరుతున్నారు. పవన్ మాత్రం వైసీపీ అధికారంలోకి రాకుండా చూడటమే తన బాధ్యతగా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ఇలా మాట్లాడుతున్నారంటే స్క్రిప్ట్ ఎక్కడ తయారవుతోందో అర్థం చేసుకోవచ్చని సజ్జల అన్నారు. పవన్ ప్రతీ సారి ఏవేవో విషయాలు మాట్లాడుతుంటారు. కానీ టీడీపీని మాత్రం ఒక్క మాట కూడా అనడం లేదు. ఒకేసారి లక్ష సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థను సృష్టించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని సజ్జల కొనియాడారు.

పవన్‌ను రావొద్దని ఎవరూ అనలేదు. కేఏ పాల్ కూడా రావొచ్చు. కానీ వచ్చి ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలి. వారానికి ఎన్ని రోజులు ఉంటారనేది ప్రశ్న కానే కాదని.. వచ్చి ఏం చేస్తారనేదే ప్రశ్నని సజ్జల చెప్పుకొచ్చారు. పవన్ సీనియస్ పొలిటీషియన్ కాదని.. ఆయన చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఆలోచనలు ఎప్పుడూ టీడీపీ, చంద్రబాబు చుట్టే తిరుగుతుంటాయని.. ఆయన హయాంలో ప్రజలకు ఏం చేశారో పవన్ చెప్పగలరా అని సజ్జల ప్రశ్నించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 62 లక్షల మందికి పైగా పెన్షన్లు అందిస్తున్నాము. కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలకు రూ. 26 వేల కోట్ల లబ్ధి చేకూరిందని సజ్జల చెప్పారు. కౌలు రైతులే కాదు.. ఏ రైతూ ఆత్మహత్యకు పాల్పడకుండా ఒక క్యాలెండర్ పెట్టుకొని.. ఎలాంటి సాయం అందాలో చూస్తున్నాము. ఏవో నాలుగు ఊర్లు తిరిగి వచ్చి విమర్శలు చేయడం సరికాదని పవన్‌కు సజ్జల హితవు పలికారు. సీఎం జగన్ చేసే పనులు ప్రజలకు నచ్చుతున్నాయి. అందుకే వైసీపీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని సజ్జల అన్నారు.

Tags:    
Advertisement

Similar News