భారమంతా రీజనల్ ఇన్ చార్జ్ లదే.. జగన్ క్లారిటీ

నెల్లూరు జిల్లా రాజకీయాల నేపథ్యంలో తాజాగా ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశం వాడివేడిగా జరిగినట్టు తెలుస్తోంది. గడప గడప కార్యక్రమంలో అసలు నేతలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఇన్ చార్జ్ లు ఓ కంట కనిపెట్టాలని సూచించారు సీఎం జగన్.

Advertisement
Update: 2023-02-03 01:04 GMT

ఏపీ వైసీపీలో అంతర్గత రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. అసంతృప్తుల అలకలు, ధిక్కార స్వరాలు పెచ్చుమీరాయి. వీటిని అదుపులో పెట్టాల్సిన బాధ్యత రీజనల్ ఇన్ చార్జ్ లదేనని స్పష్టం చేశారు సీఎం జగన్. ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఇంటింటికీ ఎలా తిరుగుతున్నారు..? అసలు తిరుగుతున్నారా లేదా..? అనే విషయాలను ప్రాంతీయ సమన్వయకర్తలు కచ్చితంగా పర్యవేక్షించాలని సూచించారు జగన్. పార్టీ నేతల మధ్య విభేదాల పరిష్కారంలో చొరవ చూపాలని, తద్వారా పార్టీ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించేలా చూడాలని సీఎం చెప్పారని తెలుస్తోంది.

వాడివేడిగా సమావేశం..

నెల్లూరు జిల్లా రాజకీయాల నేపథ్యంలో తాజాగా ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశం వాడివేడిగా జరిగినట్టు తెలుస్తోంది. గడప గడప కార్యక్రమంలో అసలు నేతలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఇన్ చార్జ్ లు ఓ కంట కనిపెట్టాలని సూచించారు సీఎం జగన్. అదే సమయంలో గృహసారథుల నియామకాలపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో.. వాలంటీర్లతోపాటు పార్టీ పరంగా గృహసారథుల నియామకం చేపట్టాలని గతంలోనే ఆదేశించారు సీఎం జగన్. కానీ ఆ కార్యక్రమం అనుకున్నంత స్పీడ్ గా ముందుకు వెళ్లలేదు. దీంతో మరోసారి సమన్వయకర్తలకు చురకలంటించారు జగన్. గృహసారథుల నియామకాలు వేగవంతం చేయాలన్నారు. అప్పగించిన పనులను సకాలంలో సరైన పద్ధతిలో చేయలేకపోతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

టార్గెట్ 2024 – టార్గెట్ 175

175కి 175 స్థానాలు టార్గెట్ గా పనిచేయాలని మరోసారి సమన్వయ కర్తలకు ఉద్భోదించారు సీఎం జగన్. అసంతృప్తుల విషయంలో ఎక్కడా ఉపేక్షించేది లేదన్నారు. అదే సమయంలో వారంతా పార్టీ లైన్ దాటి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమన్వయకర్తలపైనే ఉందన్నారు. టికెట్ల కేటాయింపులో కూడా సమన్వయకర్తలే కీలకంగా ఉంటారని కూడా పరోక్షంగా హింట్ ఇచ్చారు జగన్.

Tags:    
Advertisement

Similar News