జనసేనాని తిరుపతి నుంచి పోటీ చేయడం ఖాయమేనా..!

గత ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయగా రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో ఈ సారి జరిగే ఎన్నికల్లో గెలవడానికి అనుకూలంగా ఉన్న చోటే పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు.

Advertisement
Update: 2022-08-23 12:10 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి తిరుపతి నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా పలుమార్లు ఇలాగే ప్రచారం జరగగా.. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రచారం ఊపందుకుంది. గత ఎన్నికల్లో పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేయగా రెండు చోట్ల ఓడిపోయారు. దీంతో ఈ సారి జరిగే ఎన్నికల్లో గెలవడానికి అనుకూలంగా ఉన్న చోటే పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. ఆయన పోటీ చేయడానికి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలు ఏమున్నాయా అని..కొద్ది రోజులుగా ఆ పార్టీ నేతలు ఆరా తీస్తున్నారు.

తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తే లక్ష మెజారిటీతో గెలిపిస్తామని కొద్ది రోజుల కిందట తిరుపతి జనసేన నాయకులు ప్రకటన చేశారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఆయన పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేయగా పాలకొల్లులో ఓడిపోయినా.. తిరుపతి నుంచి మంచి మెజారిటీతో గెలిచారు. తిరుపతిలో సొంత సామాజిక వర్గమైన బలిజలు పెద్ద సంఖ్యలో ఉండటం, అభిమానుల సంఖ్య గణనీయంగా ఉండటంతో చిరంజీవి గెలుపు సాధ్యమైంది.

ఇప్పుడు మరోసారి పవ‌న్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే గెలుపు ఖాయం అని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. పవన్ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న‌టి తిరుపతి పర్యటన ఇందుకు ఊతం ఇస్తోంది. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా కడప జిల్లా సిద్ధవటం పర్యటనకు వచ్చిన పవన్ అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. ప్రస్తుతానికి జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించడం లేదు. అయినా పవన్ జనవాణి పేరిట కార్యక్రమం నిర్వహించి స్థానికుల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పార్టీకి ఉన్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికే పవన్ తిరుపతిలో పర్యటించారనే ప్రచారం జరుగుతోంది. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే విషయమై కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News