యువగళం పేరుతో జనంలోకి.. యాత్రకు లోకేష్ రెడీ

ఎక్కడికక్కడ స్థానిక నేతలు యాత్రలో పాల్గొంటున్నా, వారు కోటరీలాగా ఏర్పాటు కాకుండా నేరుగా జనం లోకేష్ ని కలిసేలా పాదయాత్ర ఉంటుంది.

Advertisement
Update: 2022-12-28 06:09 GMT

యువగళం పేరుతో జనంలోకి.. యాత్రకు లోకేష్ రెడీ

నారా లోకేష్ పాదయాత్రకు టైటిల్ ఖరారు చేశారు. యువగళం పేరుతో ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసి, మంత్రి హోదాలో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ ఆ తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. లోకేష్ నాయకత్వాన్ని టీడీపీలో కూడా కొంతమంది ఆహ్వానించలేని పరిస్థితి. అందుకే చంద్రబాబు నేతృత్వంలోనే 2024 ఎన్నికలను ఎదుర్కోడానికి ఆ పార్టీ సిద్ధపడింది. అయితే తండ్రికి చేదోడువాదోడుగా ఉండాలనుకుంటున్న లోకేష్ తాను సొంతగా యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్నారు.

జనవరి 27 నుంచి యాత్ర..

లోకేష్ పాదయాత్రకు చాన్నాళ్లుగా కసరత్తులు జరుగుతున్నాయి. సైకిల్ యాత్ర చేయాలా, లేక బస్సు యాత్ర చేయాలా అనే తర్జనభర్జనల అనంతరం పాదయాత్ర అయితే జనంతో మమేకం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని దాన్నే ఫిక్స్ చేశారు. 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు కవర్ చేసేట్టు యాత్ర షెడ్యూల్ తయారైంది. తండ్రి సొంత నియోజకవర్గం కుప్పం నుంచి జనవరి 27న లోకేష్ పాదయాత్ర మొదలు పెడతారు.

హంగు ఆర్భాటాలు లేకుండా ఈ యాత్ర ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లాగా.. పార్టీ నేతలతో కాకుండా సామాన్య ప్రజలతో లోకేష్ మమేకమయ్యేట్టు యాత్ర డిజైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానిక నేతలు యాత్రలో పాల్గొంటున్నా, వారు కోటరీలాగా ఏర్పాటు కాకుండా నేరుగా జనం లోకేష్ ని కలిసేలా పాదయాత్ర ఉంటుంది. స్థానిక నేతలతో ప్రతిరోజూ లోకేష్ సమావేశం కూడా ఉంటుంది. పార్టీ టికెట్ కావాలనుకుంటున్న ఆశావహులంతా పాదయాత్రలో తమ పట్టు నిరూపించుకోడానికి, లోకేష్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

ఓవైపు చంద్రబాబు ఇదేం ఖర్మ పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. దాదాపుగా ప్రతి నియోజకవర్గ కేంద్రాన్ని చంద్రబాబు టచ్ చేయాలనుకుంటున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇటు లోకేష్ కూడా యువగళం పాదయాత్రతో జనం మధ్యకు రాబోతున్నారు. మరి ఈ యువగళానికి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News