ఆ జిల్లాలో జగన్‌కు తలనొప్పులు తప్పవా..?

ఇక అసలు విషయంలోకి వస్తే రాష్ట్రం మొత్తంమీద వారసత్వం డిమాండ్‌తో జగన్‌ను బాగా ఇబ్బంది పెడుతున్నది ఉమ్మడి కర్నూలు జిల్లానే అనుకోవాలి

Advertisement
Update: 2022-12-01 07:13 GMT

వచ్చే ఎన్నికల్లో వారసులకు నో ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఎంతచెప్పినా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒప్పుకోవటంలేదు. వచ్చే ఎన్నికల్లో తాము పోటీచేయలేమని కాబట్టి వారసులకు టికెట్లు కేటాయించాల్సిందే అని పదేపదే జగన్ వెంటపడుతున్నారు. వారసులకు టికెట్ల విషయంలో జగన్ పెట్టుకున్న నిబంధనలను రెండు మాత్రమే. అందులో ఒకటి వృద్ధాప్యం, రెండోది అనారోగ్యం. అయితే ఈ రెండు రకాలుగానూ సూట్ కానీ వాళ్ళు కూడా రాబోయే ఎన్నికల్లో వారసులను పోటీలోకి దింపాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వస్తే రాష్ట్రం మొత్తంమీద వారసత్వం డిమాండ్‌తో జగన్‌ను బాగా ఇబ్బంది పెడుతున్నది ఉమ్మడి కర్నూలు జిల్లానే అనుకోవాలి. ఈ జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను ఇప్పటికి 5 నియోజకవర్గాల్లో వారసులను రంగంలోకి దింపాలని మంత్రి, ఎమ్మెల్యేలు చాలా గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఇప్పటికే జగ‌న్‌ను అడగటం, ఆయ‌న కాదని చెప్పటం కూడా అయిపోయింది. ఒక్క ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాత్రం వారసుడికి అవకాశం ఉందని సమాచారం.

ఈమధ్యనే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి తన వారసుడు జగన్మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వమని అడిగారు. ఎమ్మెల్యేకి బాగా వయసైపోవటంతో పాటు కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయట. జగన్ ఏమిచెప్పారో తెలీదుకానీ పై రెండు కారణాల వల్ల కొడుక్కి టికెట్ కేటాయించే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. ఇక డోన్ ఎమ్మెల్యే, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా తన కొడుక్కి టికెట్ కేటాయించాలని అడుగుతున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారట.

మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన కొడుకు ధరణీరెడ్డికి టికెట్ కావాలని అడుగుతున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తన కొడుకు శివనర్సింహారెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆధోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి తన కొడుకు జయమనోజ్ రెడ్డికి పోటీచేసే అవకాశం ఇవ్వాలని జగన్‌ను అడిగారు. వారసులకు టికెట్లు ఇవ్వమని మిగిలిన జిల్లాల్లో కూడా ఒత్తిళ్ళున్నా కర్నూలు నుంచి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరి వీళ్ళ డిమాండ్లను చివరకు జగన్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News