గర్జించకపోతే నష్టపోతాం - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఉత్తరాంధ్ర అభివృద్ధి, భవిష్యత్ తరాల కోసం జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలందరూ మద్దతు పలకాలని కోరారు. శుక్రవారం ఆయన విశాఖ గర్జన ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement
Update: 2022-10-14 12:16 GMT

రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలంటూ అక్కడి రైతులు పాదయాత్ర చేస్తుంటే.. మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ శ్రేణులు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ శ్రేణులు మద్దతు తెలుపుతున్నాయి. కాగా ప్రస్తుతం ఈ యాత్ర తూర్పుగోదావరి జిల్లాకు చేరుకుంది. త్వరలో ఉత్తరాంధ్రకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఇదే సమయంలో మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ నేతలు, మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. ఈ నెల 15న(శనివారం) విశాఖలో విశాఖ గర్జన పేరిట భారీ సభను నిర్వహించబోతున్నారు.


జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్‌కు భారీ జనసమీకరణ చేసేందుకు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కృషి చేస్తున్నారు. ఇదిలా ఉండగా..విశాఖ రాజధాని కాకుండా టీడీపీ అడ్డుకుంటోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంపైకి అమరావతి రైతులు దండయాత్రగా వస్తున్నారని వారు అంటున్నారు.

తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి, భవిష్యత్ తరాల కోసం జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీసుకున్న నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజలందరూ మద్దతు పలకాలని కోరారు. శుక్రవారం ఆయన విశాఖ గర్జన ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి శనివారం ఉదయం 9 గంటలకు జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో కలసి అమర్నాథ్ పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. శనివారం జరిగే ర్యాలీలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు పాల్గొని తమ ఆకాంక్షలను తెలియజేయనున్నారని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలియచేసే సమయం ఆసన్నమైందని, ఇప్పుడు మౌనంగా ఉంటే, మన భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు గర్జనకు భారీగా తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. మన ప్రాంతం అభివృద్ధి చెందకూడదన్న దురుద్దేశంతో అమరావతి రైతులు దండయాత్రగా మనపైకి వస్తున్నారని వాళ్లు కళ్ళు తెరుచుకునేలా ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు.

ముందు ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోండి

గత కొద్ది రోజులుగా జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ గర్జన మీద చేస్తున్న వ్యాఖ్యలను అమర్నాథ్ తిప్పికొట్టారు. పవన్ జనవాణి పేరుతో విశాఖ వస్తున్నారని, ముందు ఆయన ఇంట్లో సమస్యలను పరిష్కరించుకొని, ఆ తర్వాత జనం సమస్యల గురించి ఆలోచించాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలను ఇప్పటి వరకు పట్టించుకోని పవన్ కల్యాణ్‌ కు అకస్మాత్తుగా ఈ ప్రాంత ప్రజలు ఎందుకు గుర్తుకు వచ్చారని ప్రశ్నించారు. డబ్బులు ఎక్కువ వస్తాయని పవన్ కాల్షీట్లను అమ్ముకుంటున్నారని విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News