ప్రభుత్వమేమన్న సినిమా సెట్టింగా.. కూల్చడానికి.. పవన్ పై అంబటి ఫైర్

పవన్ కళ్యాణ్ కు ప్రస్టేషన్ ఎక్కువైందని.. ప్రభుత్వం అంటే సినిమా సెట్టింగా.. కూల్చివేయడానికి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందన్నారు.

Advertisement
Update: 2022-11-05 13:42 GMT

గత నెల విశాఖలో పవన్ పర్యటించిన తర్వాత రాజకీయం వైసీపీ వర్సెస్ జనసేనగా మారింది. ఇవాళ ఇప్పటంలో పవన్ పర్యటించిన తర్వాత మరోసారి అటువంటి రాజకీయ పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చి పారదొబ్బండి.. అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

దీనిపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు ప్రస్టేషన్ ఎక్కువైందని.. ప్రభుత్వం అంటే సినిమా సెట్టింగా.. కూల్చివేయడానికి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుందన్నారు. ఇప్పటంలో 53 ఇళ్లను కూల్చివేశారని పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడంలో వాస్తవం లేదన్నారు. పవన్ కళ్యాణ్ సభకు స్థలం ఇచ్చిన వారి ఇళ్లను ప్రభుత్వం కూల్చి వేస్తోందని పవన్ అంటున్నారన్నారు. కానీ, పవన్ సభ మార్చిలో జరిగిందని.. ఇప్పటంలో రోడ్డు విస్తరణకు జనవరిలోనే మార్కింగ్ చేయడం జరిగిందని అంబటి పేర్కొన్నారు. రోడ్డుకు మరోవైపు విస్తరణ పనులు గతంలోనే పూర్తి చేసినట్లు చెప్పారు. దీనిపై పవన్ కళ్యాణ్ కు అవగాహన లేదని విమర్శించారు.

డ్రైన్ ను కట్టేందుకు అడ్డుగా ఉన్న ఆక్రమణలను మాత్రమే ఇప్పటంలో ప్రభుత్వం తొలగించిందని.. ఇది ఎక్కడైనా జరిగేదేనని అంబటి అన్నారు. పవన్ కళ్యాణ్ ను చంపడానికి రూ. 250 కోట్ల సుపారీ ఇచ్చారని అంటున్నారని, అతడిని చంపడానికి గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారికి రూ. 250 కోట్లు ఇవ్వడం ఎందుకని .. అందులో సగం డబ్బు పవన్ కళ్యాణ్ కు ప్యాకేజీగా ఇస్తే తోక ఆడించుకుంటూ వస్తాడని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News