జగన్‌కు చుట్టుకోనున్న కాపు రిజర్వేషన్లు

దాదాపు మూడు సంవత్సరాల్లో అనేక విచారణలు జరిగిన తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టు ధర్మాసనం 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ సబబే అని తీర్పిచ్చింది. ఎప్పుడైతే సుప్రీం కోర్టు తీర్పిచ్చిందో వెంటనే కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి.

Advertisement
Update: 2022-11-08 05:20 GMT

అగ్రవర్ణాల్లోని పేదల కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో ఉద్దేశించిన 10 శాతం రిజర్వేషన్ అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోబోతోంది. 2019లో నరేంద్రమోడీ కల్పించిన 10 ఈబీసీ రిజర్వేషన్లలో చంద్రబాబునాయుడు 5 శాతాన్ని విడదీసి అచ్చంగా కాపులకు కేటాయించారు. కాపులను బీసీల్లో చేరుస్తానని తప్పుడు హామీ ఇచ్చిన చంద్రబాబు ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ అంశాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. అందుకనే అగ్రవర్ణాల్లో చాలామంది పేదలున్నా దాన్ని పట్టించుకోకుండా 5 శాతం కాపులకు కేటాయించారు.

అయితే దీనిపై కొందరు కోర్టుకెళ్ళటంతో 5 శాతం రిజర్వేషన్ను కొట్టేసింది. అలాగే 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించటమే తప్పని మరికొందరు కోర్టుకెక్కారు. దాదాపు మూడు సంవత్సరాల్లో అనేక విచారణలు జరిగిన తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టు ధర్మాసనం 10 శాతం ఈబీసీ రిజర్వేషన్ సబబే అని తీర్పిచ్చింది. ఎప్పుడైతే సుప్రీం కోర్టు తీర్పిచ్చిందో వెంటనే కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్లు మొదలయ్యాయి.

కొద్ది రోజులుగా రాజకీయాలంతా కాపుల చుట్టూనే తిరుగుతున్న విషయం అందరు చూస్తున్నదే. దాదాపు 19 శాతం జనాభా ఉన్న కాపుల్లో అత్యధికులు ఎవరివైపు ఉంటే వాళ్ళకు బాగా అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటున్నారు. ఇందు కోసమే కాపులను ఆకట్టకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో కాపుల ఓట్లన్నీ గుండుతుత్తగా తనకే పడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్లాన్ చేస్తున్నారు. పవన్‌ను ముందుపెట్టి కాపుల ఓట్లను కొల్లగొట్టేందుకు చంద్రబాబు నాయుడు కూడా వర్కవుట్ చేస్తున్నారు.

సరిగ్గా ఎన్నికలకు ఏడాదిన్నరుందనగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు జగన్ మెడకు చుట్టుకోబోతోంది. కాపుల అభివృద్ధిపై తనకు నిజంగానే చిత్తశుద్ది ఉందని నిరూపించుకునేందుకు అయినా జగన్ 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. జగన్ గనుక ఇప్పుడు 5 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే కాపుల్లో మంచి మైలేజ్ వచ్చే అవకాశముంది. అమలు చేయకపోతే వ్యతిరేకం అయ్యే అవకాశముంది. జగన్ అమలు చేసిన 5 శాతం రిజర్వేషన్లను చంద్రబాబు కూడా క్లైమ్ చేసుకునే అవకాశముంది. తూతూ మంత్రంగా రిజర్వేషన్ ప్రకటించటం వేరు చిత్తశుద్దితో అమలు చేయటం వేరన్న విషయాన్ని జగన్ కాపులకు చెప్పగలగితే రాజకీయం భలే రంజుగా ఉంటుంది.

Advertisement

Similar News