జనసేన సమర్పించు.. జగన్ భజన మండలి సూక్తి ముక్తావళి

వివిధ సందర్భాల్లో మాట్లాడిన బూతులను ఒక వీడియోలో జత చేర్చిన జనసేన పార్టీ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. దానికి 'జగన్ భజన మండలి సూక్తి ముక్తావళి' అని పేరు పెట్టింది.

Advertisement
Update: 2022-10-22 14:03 GMT

గత వారం రోజులుగా ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా రాజకీయాలు సాగుతున్నాయి. విశాఖలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన విశాఖ గర్జనకు వైసీపీకి చెందిన మంత్రులు హాజరై తిరిగి వెళ్లే సమయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు వారి కార్లను ధ్వంసం చేయడంతో రాజకీయ దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. మంత్రుల కార్లపై దాడి చేసిన వారిని అరెస్టు చేయడం, విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లిన పవన్ కల్యాణ్ పై ప్ర‌భుత్వం ఆంక్షలు విధించడంతో పవన్ అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చారు.

ఆ తర్వాత మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో చెలరేగిపోయి మాట్లాడారు. తన జోలికి వచ్చే నాయకులను చెప్పుతో కొడతానని, గొంతు పిసుకుతానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ముఖ్య నేతలు, శ్రేణులు కూడా దీటుగా కౌంటర్లు ఇచ్చారు.

అనంతరం ఆళ్లగడ్డలో జరిగిన సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. నాయకులు అని చెప్పుకునేవారు టీవీల్లోకి వచ్చి చెప్పు చేత పట్టుకొని, నాయకులను చెప్పుతో కొడతానని హెచ్చరిస్తున్నారని, ఇలాంటి నాయకులు మన వ్యవస్థలో ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. అయితే సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు జనసేన తాజాగా కౌంటర్ ఇచ్చింది.

వైసీపీకి చెందిన ముఖ్య నేతలు తమ్మినేని సీతారాం, కొడాలి నాని, రోజా, ధర్మాన కృష్ణదాస్‌ తదితర నేతలు వివిధ సందర్భాల్లో మాట్లాడిన బూతులను ఒక వీడియోలో జత చేర్చిన జనసేన పార్టీ ఆ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేసింది. దానికి 'జగన్ భజన మండలి సూక్తి ముక్తావళి' అని పేరు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి విశాఖపట్నంలో వైసీపీ, జనసేన మధ్య చెలరేగిన ఈ గొడవ ఇప్పటికిప్పుడు సద్దుమణిగేలా కనిపించడం లేదు.

Tags:    
Advertisement

Similar News