అధికారం లేనోడిని.. నాపై ఏడుపెందుకు..?

తమది రౌడీ సేన కాదని.. విప్లవసేన అని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. ఫ్యూడలిస్టిక్‌ కోటలు బద్దలు కొట్టి తీరుతామని హెచ్చరించారు.

Advertisement
Update: 2022-11-27 08:50 GMT

అధికారం లేనోడిని.. నామీద పడి ఏడుస్తారెందుకు..? అంటూ వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. ఇప్పటం బాధితులతో మంగళగిరి పార్టీ కార్యాలయంలో సమావేశమైన ఆయన ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఇప్పటంలో గ్రామస్థుల గడపలు కూల్చడాన్ని తాను మర్చిపోలేనన్నారు. అక్కడ పడిన ప్రతి సుత్తి దెబ్బా తన గుండెపై కొట్టినట్లే అనిపించిందని చెప్పారు. ఈసారి వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ ఛాలెంజ్‌ విసిరారు పవన్.

నా కులపోళ్లతో నన్నే తిట్టిస్తారా..?

కులాలను ఎప్పుడూ తాను ద్వేషించనని చెప్పారు పవన్ కల్యాణ్. తాను జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై ఎప్పుడు విమర్శలు చేసినా, తన కులానికి చెందిన నేతలతో తనను తిట్టిస్తారని, అది జగన్ వికృత భావం అని అన్నారు. విభజించి పాలించిన బ్రిటీష్‌ వారు మన దేశం నుంచి వెళ్లిపోయినా ఆ గుణగణాలన్నీ వైసీపీలో ఉన్నాయని చెప్పారు. ఆ పరిస్థితి మారాలని, కులాలన్నీ దేహీ అనే ధోరణి నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు.

పార్టీనా.. ఉగ్రవాద సంస్థా..?

వైసీపీ రాజకీయ పార్టీనా లేక ఉగ్రవాద సంస్థా అని నిలదీశారు పవన్ కల్యాణ్. మా వాళ్లను బెదిరిస్తారా..? మాకు ఎవరూ అండగా ఉండకూడదా..? రాజకీయం మీరే చేయాలా..? మేం చేయలేమా..? అని ప్రశ్నించారు. ఫ్యూడలిస్టిక్‌ కోటలు బద్దలు కొట్టి తీరుతామని హెచ్చరించారు. ఎవరికి అన్యాయం జరిగినా స్పందిస్తామని, జనసేనకు ఓట్లు వేసినా, వేయకపోయినా జనసైనికులెప్పుడూ జనాలకు అండగా ఉంటారని చెప్పారు పవన్.

విప్లవ సేన..

తమది రౌడీ సేన కాదని.. విప్లవసేన అని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. ఇంత అభిమాన బలం ఉన్న తననే ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారాయన. దేశం, రాష్ట్రంలో లంచాలు లేని వ్యవస్థే తమ లక్ష్యమని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు దానికోసం పోరాడతానన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు పవన్. పదే పదే తనపై ఢిల్లీ వెళ్లి వైసీపీ వాళ్లు ప్రధానికి ఫిర్యాదులు చేసి వచ్చారని, కానీ తాను అలాంటివాడిని కాదని, ఏదైనా ఇక్కడే తేల్చుకుంటానని, ఇప్పటం సమస్యను ఢిల్లీ వరకు తీసుకెళ్లనని అన్నారు. తాను ప్రధానితో ఏం మాట్లాడానో చెప్పాలని పదే పదే సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతున్నారని, తాను వారిలాగా ఢిల్లీకి వెళ్లి చాడీలు చెప్పలేదని, ప్రధానితో తానెప్పుడు మాట్లాడినా దేశభద్రత, సగటు మనిషి రక్షణ గురించే మేధోమథనం జరిగిందన్నారు.

Tags:    
Advertisement

Similar News