పవన్‌కు రఘురామ చెబుతున్న పలుకుబడి ఉందా?

టీడీపీకి అనుకూలమని పేరున్న మీడియా ఒక విధంగా జూ.ఎన్టీఆర్‌ను బ్లాక్‌ మెయిల్ చేస్తోంది. బీజేపీతో కలిస్తే కేరీర్ పాడవుతుంది, టీడీపీ వర్గాలన్నీ దూరం అవుతాయి అంటూ హెచ్చరిస్తూ కథనాలు రాస్తున్నాయి.

Advertisement
Update: 2022-09-05 04:32 GMT

జూ.ఎన్టీఆర్‌ సేవలను బీజేపీ వాడుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మరోసారి టీడీపీని ఉలికిపాటుకు గురిచేశాయి. టీడీపీకి అనుకూలమని పేరున్న మీడియా ఒక విధంగా జూ.ఎన్టీఆర్‌ను బ్లాక్‌ మెయిల్ చేస్తోంది. బీజేపీతో కలిస్తే కేరీర్ పాడవుతుంది, టీడీపీ వర్గాలన్నీ దూరం అవుతాయి అంటూ హెచ్చరిస్తూ కథనాలు రాస్తున్నాయి. ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా అదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఒకవైపు పవన్‌ కల్యాణ్‌తో పొత్తు ఉండి కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకుంటామని సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రస్థాయి నాయకులతో టచ్‌లో లేరని.. ఆయన బీజేపీ పెద్దలతోనే నేరుగా టచ్‌లో ఉన్నారని రఘురామ చెప్పారు. అయితే అందుకు ఆధారాలు మాత్రం కనిపించడం లేదు. ఇటీవల పవన్‌ కల్యాణ్ పుట్టిన రోజు జరిగితే కనీసం మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. బీజేపీతో కలిసినప్పటికీ ఇప్పటి వరకు 10 నిమిషాలు మాట్లాడేందుకు కూడా పవన్‌ కు బీజేపీ పెద్దల నుంచి అపాయింట్‌మెంట్ దొరకలేదు. పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది రాష్ట్రస్థాయి నాయకులే గానీ.. జాతీయ స్థాయి నాయకులు అసలు పవన్‌ తమకు గుర్తే లేరన్నట్టుగా వ్యవహరించారు. కాబట్టి ఆయనకు జాతీయ నాయకులతో పరిచయం ఉందని నమ్మడం కష్టమే.

అమిత్ షాతో భేటీకి ముందు వరకు జూ.ఎన్టీఆర్‌కు వైసీపీ నేతలతో సంబంధాలున్నాయని ప్రచారం చేసి, ఆయన్ను టీడీపీ శ్రేణులకు ఎలా దూరం చేయాలా అన్నట్టుగా టీడీపీ నేతలు, మీడియా వైఖరి ఉండేది, కానీ జూ.ఎన్టీఆర్‌ను బీజేపీ తీసుకుంటే ఏపీలో టీడీపీకి సంక్షోభం తప్పదని గ్రహించిన తర్వాత అందుకు భిన్నంగా బీజేపీతో వెళ్తే కేరీర్ పాడవుతుందని ప్రచారం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News