చంద్రబాబు, పవన్ నోరెత్తలేకపోతున్నారా?

18 ఎమ్మెల్సీ స్థానాల‌కు 11 మంది బీసీలను ఎంపిక చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇదే విషయంలో చంద్రబాబే కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నోరెత్తలేదు. మొత్తానికి ఒకేదెబ్బకు జగన్ రెండు ప్రధాన పార్టీల అధినేతల నోళ్ళు మూయించినట్లయ్యింది.

Advertisement
Update: 2023-02-21 06:01 GMT

వైసీపీలో జరిగిన తాజా పరిణామాలపై తెలుగుదేశంపార్టీ నోరెత్తలేకపోతోంది. బీసీలను ఉద్దరించేది తెలుగుదేశంపార్టీ మాత్రమే అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబునాయుడు అండ్ కో ఇప్పుడు ఎందుకని నోరెత్తటంలేదు? తొందరలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ స్థానాలకు జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 18 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ 18 స్థానాల్లో 11 స్థానాలను బీసీలకే కేటాయించారు. ఇందులో కూడా అవకాశం ఉన్నంతలో వివిధ ఉపకులాల నుంచి ఎంపిక చేశారు.

జగన్ తాజా ఎంపికపై బీసీలు హ్యాపీగానే ఉన్నారు. ఎక్కడైనా తమ ఉపకులానికి పదవి దక్కలేదని, తమను జగన్ పట్టించుకోలేదని చిన్న చిన్న అలకలు, హెచ్చరికలు ఉంటే ఉండవచ్చు. 18 స్థానాల్లో 11 మంది బీసీలను ఎంపిక చేయటం అంటే మామూలు విషయం కాదు. మరిదే విషయమై చంద్రబాబు అండ్ కో ఎందుకని నోరెత్తటం లేదు. జగన్ ఏమిచేసినా అందులో నెగిటివ్ కోణాన్ని మాత్రమే ఎత్తిచూపటానికి అలవాటు పడిపోయిన తమ్ముళ్ళు ఇప్పుడు మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు.

ఎందుకంటే ఒకేసారి 11 మంది బీసీలను ఎంపిక చేసిన విషయం స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు కూడా జగన్ బీసీలకు అన్యాయం చేశాడని ఆరోపణలు చేస్తే చెల్లుబాటు కావు. ఎందుకంటే తనకు అవకాశం ఉన్నప్పుడు చంద్రబాబు బీసీలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ విషయం తమ్ముళ్ళకు బాగా తెలుసు. ఏ సామాజి కవర్గానికి ఎవరెన్ని పదవులు ఇచ్చారన్నది నోటిమాటగా చెప్పే విషయం కాదు. రికార్డు రూపంలో ఎవరైనా చూసుకోవచ్చు.

ఇక్కడే జగన్, చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా తెలిసిపోతోంది. కాబట్టి ఇప్పుడు కూడా జగన్‌ను తప్పుపడుతూ మాట్లాడితే బీసీల నుండే తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని చంద్రబాబు అండ్ కో గ్రహించినట్లున్నారు. అందుకనే జగన్ ఎంపిక చేసిన అభ్యర్థులపై మాట్లాడటానికి టీడీపీ నేతలు పెద్దగా ఇష్టపడటంలేదు. ఇదే విషయంలో చంద్రబాబే కాదు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నోరెత్తలేదు. మొత్తానికి ఒకేదెబ్బకు జగన్ రెండు ప్రధాన పార్టీల అధినేతల నోళ్ళు మూయించినట్లయ్యింది.

Tags:    
Advertisement

Similar News