పాదయాత్రలపై పేటెంట్ హక్కు వైఎస్ కుటుంబానిదే..

పాద యాత్రతో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని మేనిఫెస్టోలో పెట్టి.. 98 శాతం ఆ హామీలను అమలు చేసిన ఘనత జగన్ దేనని అన్నారు మంత్రి జోగి రమేష్. బలవంతుడైన జగన్‌ ని ఎదుర్కోవాలంటే, వైరి వర్గాల శక్తి చాలదని చెప్పారు.

Advertisement
Update: 2022-11-06 08:49 GMT

అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ లో చలనం తెచ్చి, ఏపీలో అధికారం వచ్చేలా చేసింది ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర. ఆ తర్వాత అంతటి మహాపాదయాత్ర మళ్లీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, అసలు పాదయాత్రలపై పేటెంట్ హక్కు వైఎస్ కుటుంబానిదే అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్ జగన్ తోపాటు ఆనాడు యాత్రలో పాల్గొన్న వారిని సన్మానించారు. ఆనాటి యాత్ర స్మృతుల్ని గుర్తు చేసుకున్నారు. పనిలో పనిగా ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్.


తన యాత్రతో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని మేనిఫెస్టోలో పెట్టి.. 98 శాతం ఆ హామీలను అమలు చేసిన ఘనత జగన్ దేనని అన్నారు మంత్రి జోగి రమేష్. బలవంతుడైన జగన్‌ ని ఎదుర్కోవాలంటే, వైరి వర్గాల శక్తి చాలదని చెప్పారు. అందుకే ఏదో ఒక విధంగా జగన్ ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూస్తున్నారని ఆరోపించారు. కూల్చేయడానికి, జగన్ సర్కారేమీ పేక మేడో, సినిమా సెట్టింగో కాదని పవన్ కి కౌంటర్ ఇచ్చారు. ప్రజల నుంచి జగన్‌ ను ఎవరూ వేరు చేయలేరన్నారు జోగి రమేష్. వైఎస్సార్సీపీ కంచుకోటను కదిలించే కెపాసిటీ కూలిపోయిన టీడీపీ దగ్గర లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని, చంద్రబాబు సహా అందరినీ ఓడించేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

పాదయాత్ర పేటెంట్ ఒక్క వైఎస్ కుటుంబానికే దక్కుతుందని అన్నారు మంత్రి మేరుగ నాగార్జున. ప్రజాస్వామ్యం అపహాస్యం అయినప్పుడు జగన్ పాదయాత్ర చేపట్టారని వివరించారు. ప్రజల కోసం ఆయన సాహసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఆ పాదయాత్రే నేడు రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికిందని, భావి తరాలకు బంగారు బాట వేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన జగన్, ఏపీకి అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ లాగా నిలిచిపోయారని చెప్పారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర అనే గొప్ప యజ్ఞానికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయని అన్నారు.

Tags:    
Advertisement

Similar News