జగన్ తప్పు చేశారు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని టీటీడీ బోర్డు స‌భ్యుడిగా నియమించటంతో ఆరోపణలు, విమర్శలు మొదలైపోయాయి. అలాంటి వ్య‌క్తిని ఏ ప్రాతిపదికన బోర్డు సభ్యుడిగా నియమించారో అర్థంకావటంలేదు.

Advertisement
Update: 2023-08-26 05:17 GMT

ప్రభుత్వం కొత్తగా నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ నిందితుడు శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నారు. శరత్ అంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడికి సోదరుడు అన్న విషయం తెలిసిందే. బోర్డు సభ్యులుగా ఎవరిని నియమించాలి అన్న విషయం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి విచక్షణే అనటంలో అనుమానం లేదు. కానీ బోర్డులో నియమితులైన సభ్యుల వల్ల టీటీడీ ప్రతిష్ట పెరగాలి. ప్రతిష్ట పెరగకపోయినా పర్వాలేదు కనీసం మచ్చపడకుండా ఉంటే అదే పదివేలు.

కానీ ఇప్పుడు శరత్ చంద్రారెడ్డిని నియమించటంతో బోర్డు మీద ఆరోపణలు, విమర్శలు మొదలైపోయాయి. శరత్‌ను ఏ ప్రాతిపదికన బోర్డు సభ్యుడిగా నియమించారో అర్థంకావటంలేదు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆల్రెడీ జైలుకు వెళ్ళి బెయిల్ మీద బయట తిరుగుతున్న శరత్ తప్ప మరో వ్యక్తే జగన్‌కు కనబడలేదా? లిక్కర్ స్కామ్ లో శరత్ పీకల్లోతు కూరుకుపోయిన విషయం అందరూ చూస్తున్నదే. బెయిల్ తెచ్చుకోవటానికి నానా అవస్థ‌లు పడ్డారు. చివరకు భార్యకు తీవ్ర అనారోగ్యమని చెప్పుకుంటే కానీ బెయిల్ దొరకలేదు.

రేపు లిక్కర్ స్కామ్ లో శరత్ దోషని తేలితే అప్పుడు పోయేది టీటీడీ ట్రస్టు బోర్డు పరువే. శరత్‌ను నియమించటంతో ఇప్పుడు జగన్ పరువు పోయింది. ఎవరికైనా ఏదైనా పదవులిచ్చేటపుడు వాళ్ళపైన కేసులున్నాయా అని చూస్తారు. ఎందుకంటే పదవులు అందుకోబోయే వ్యక్తులు ఏ కేసుల్లోనూ ఉండకూడదన్నది మౌళిక సూత్రం. రాజకీయంగా ప్రభుత్వాలు ఎన్నో కేసులు పెడతుంటాయి. ధర్నాలు, ఆందోళనలు చేసినప్పుడు పెట్టే కేసులను ఎవరు సీరియస్‌గా తీసుకోరు.

కాబట్టి వాటి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. కానీ శరత్ ఇరుక్కున్నది అలాంటి రాజకీయపరమైన కేసు కాదు. ఆర్థికపరమైన లిక్కర్ స్కామ్. శరత్‌పై సీబీఐ, ఈడీలు మోపిన అభియోగాలు, చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయని కోర్టు కూడా నమ్ముతోంది. అందుకనే బెయిల్ కూడా చాలా కాలం ఇవ్వలేదు. మామూలుగా అయితే బెయిల్ దొరకదని అర్థ‌మైపోయి చివరకు మెడికల్ గ్రౌండ్‌లో బెయిల్ తెచ్చుకున్నారు. అలాంటి శరత్‌కు బోర్డులో సభ్యత్వం ఇవ్వటం జగన్ తెలిసి చేసిన తప్పే.


Tags:    
Advertisement

Similar News