జనాల్లోకి జగన్..రూట్ మ్యాప్ రెడీ అవుతోందా?

వచ్చే ఎన్నికల్లోపు వీలైనంతమంది జనాలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కలవాలన్నదే జగన్ టార్గెట్. దీనికి అనుగుణంగానే కొందరు మంత్రులు, ఉన్నతాధికారులతో ఇదే విషయమై చర్చించారని సమాచారం.

Advertisement
Update: 2023-02-08 06:05 GMT

ప్రతిపక్షాలను చిత్తు చేయటానికి జగన్మోహన్ రెడ్డి సరికొత్త కార్యక్రమం రెడీ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత వీలైనంత తొందరలో జనాలతో మమేకమయ్యేందుకు అవసరమైన రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. ‘బస్సుయాత్ర - పల్లెనిద్ర’ పేరుతో వినూత్న కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఎన్నికల్లోపు వీలైనంతమంది జనాలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కలవాలన్నదే జగన్ టార్గెట్. దీనికి అనుగుణంగానే కొందరు మంత్రులు, ఉన్నతాధికారులతో ఇదే విషయమై చర్చించారని సమాచారం.

రాబోయే ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపించటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో మళ్ళీ జగన్ గెలిస్తే తమకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భయపడుతున్నారు. అందుకనే ఎలాగైనా వైసీపీని ఓడించాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ మళ్ళీ గెలిస్తే టీడీపీ, జనసేన భవిష్యత్తు సమస్యల్లో పడిపోతుందన్నది వీళ్ళిద్దరి భయం.

కాబట్టి గెలుపే లక్ష్యంగా చంద్రబాబు ఇప్పటికే బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ..రాష్ట్రానికి అనే కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పుడు తాత్కాలిక విరామం ఇచ్చారు. పోయిన నెలలో కుప్పంలో లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర మొదలుపెట్టారు. పవన్ కూడా యాత్రలు చేయటానికి వారాహి పేరుతో ఒక వాహనాన్ని కూడా రెడీ చేసుకున్నారు. అయితే యాత్రలు ఎప్పుడు మొదలుపెట్టేది మాత్రం తెలియ‌దు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేయటం కోసమే జగన్ మళ్ళీ బస్సుయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.

విడతలవారీగా జరగబోయే ఈ బస్సుయాత్ర-పల్లెనిద్ర కార్యక్రమం మ్యాగ్జిమమ్ గ్రామీణ ప్రాంతాలను టచ్ చేయబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో వీలైనన్ని మండల కేంద్రాల్లో కార్యక్రమం ఉండేట్లుగా రూట్ మ్యాప్ రెడీ అవుతోంది. కాబ‌ట్టి క్షేత్ర‌స్థాయిలో జరుగుతున్నది చూస్తుంటే మూడు ప్రధాన పార్టీలు తమ కార్యక్రమాలతో రాబోయే కాలమంతా జనాల్లోనే ఉండబోతున్నాయి. ఇందుకనే ఈ ఏడాదిలోనే ఎన్నికల వాతావరణం మొదలైపోవటం ఖాయమని అనిపిస్తోంది. మరి జనాలు ఎవరిని ఆశీర్వదిస్తారో చూడాలి.

Tags:    
Advertisement

Similar News