ఏపీలో పవన్ తో బీజేపీ స్నేహం ముగిసినట్టేనా ? సోమూ వీర్రాజు మాటలకు అర్దం ఏంటి ?

మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న సోమూ వీర్రాజు ఈ రోజు జనసేన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జనసేన తమతో కలిసి వస్తేనే ఆ పార్టీతో పొత్తు ఉంటుందని, లేదంటే జనంతోనే పొత్తు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement
Update: 2023-02-04 10:54 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, జనసేన మధ్య స్నేహం బెడిసికొట్టిందా ? నిన్నటి దాకా పవన్ మాతోనే ఉన్నాడు, మాతోనే ఉంటాడు అని మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజు ఈ రోజు మాట మార్చాడు.

మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న సోమూ వీర్రాజు ఈ రోజు జనసేన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జనసేన తమతో కలిసి వస్తేనే ఆ పార్టీతో పొత్తు ఉంటుందని, లేదంటే జనంతోనే పొత్తు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీ లో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోవద్దంటూ పదే పదే చెప్తున్న పవన్ కళ్యాణ్ తెలుగు దేశం పార్టీకి దగ్గరవడం బీజేపీ గమనిస్తోంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. పవ‌నేమో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబు కూడా పవన్ సహాయంతో బీజేపీకి దగ్గరవ్వాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పటికీ బీజేపీ బాబును దూరం పెడుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ ను టీడీపీకి దూరం చేయడానికి బీజేపీ అధిష్టానం చాలా ప్రయత్నాలు చేసిందని సమాచారం. అయితే పవన్ మాత్రం తెలుగుదేశం లేకుండా వైసీపీని ఓడించడం అసాధ్యమన్న భావనతో ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ కు, బీజేపీ నాయకులకు మధ్య విభేదాలు తీవ్రమైనట్టు సమాచారం.

అవసరమైతే జనసేనను కూడా దూరంపెట్టి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలి కానీ టీడీపీతో మాత్రం చేతులు కలపవద్దని పట్టుదలగా ఉందట బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ్ళటి సోమూ వీర్రాజు వ్యాఖ్యలను చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు జనసేనతో తమ పొత్తుపై చాలా ధీమాగా మాట్లాడిన వీర్రాజు ఈ రోజు మాట మార్చడం ఇద్దరి దారులు వేర‌య్యాయనేందుకు సూచన అని అనుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News