నేను రాజకీయాలకతీతం.. పిఠాపురం వెళ్లడం లేదు.. - చిరంజీవి వ్యాఖ్యలు వైరల్

పిఠాపురానికి వెళ్లి జనసేన తరఫున ప్రచారం చేస్తానని మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. అలాంటి ప్రశ్నలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.

Advertisement
Update: 2024-05-10 09:47 GMT

తాను రాజకీయాలకు అతీతంగా ఉండాలనుకుంటున్నానని, జనసేన తరఫున ప్రచారం చేసేందుకు పిఠాపురానికి వెళ్లడం లేదని మెగాస్టార్ చిరంజీవి స్ప‌ష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను రాజకీయాలకు అతీతంగా ఉండాలని అనుకుంటున్నట్లు చిరంజీవి వెల్లడించారు. పిఠాపురానికి వెళ్లి జనసేన తరఫున ప్రచారం చేస్తానని మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. అలాంటి ప్రశ్నలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. తాను పిఠాపురానికి వెళ్లి జనసేన తరఫున ప్రచారం చేయాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోలేదని చిరంజీవి చెప్పారు.

కళ్యాణ్ ఎప్పుడూ తన సౌకర్యానికే వదిలేస్తాడన్నారు. పవన్ కళ్యాణ్ బాగుండాలని, జీవితంలో ఎన్నో సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్నానని చెప్పడానికే తాను వీడియో విడుదల చేసినట్లు గుర్తుచేశారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగాలని తమ కుటుంబ సభ్యులు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని వెల్లడించారు.

ఇప్పటికీ మీరు కాంగ్రెస్ లోనే ఉన్నారా? అని విలేకరులు ఈ సందర్భంగా చిరంజీవిని ప్రశ్నించగా, సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో వెనుదిరిగారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగాలని తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని చిరంజీవి ఇటీవల ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి పిఠాపురానికి వెళ్లి తన సోదరుడి విజయం కోసం ప్రచారం నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తాజాగా చిరంజీవి స్పష్టం చేశారు. జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ కూటమికి చిరంజీవి ఆశీర్వాదం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాను రాజకీయాలకు అతీతం అని చిరంజీవి చేసిన ప్రకటన కూటమిని నిరాశలో ముంచిందనే చెప్పాలి.

Advertisement