గుండు చేయించుకున్నందుకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు

ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం, మేలాపురం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న‌ ఆదినారాయణ గత నెల 5న కర్ణాటకలోని పావగడ శనేశ్వర స్వామి గుడికి వెళ్లి గుండు గీయించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
Update: 2022-11-24 12:13 GMT

భగవంతునికి తలనీలాలు అర్పించి మొక్కు తీర్చుకున్నాడో ప్రభుత్వ టీచర్. అదే ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసింది. ప్రస్తుతం ఆయన సస్పెండ్ అయ్యి ఇంటి దగ్గర కూర్చుకున్నారు.

ఏపీలోని శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణం, మేలాపురం ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్న‌ ఆదినారాయణ గత నెల 5న కర్ణాటకలోని పావగడ శనేశ్వర స్వామి గుడికి వెళ్లి గుండు గీయించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత విధులకు హాజరయ్యేందుకు పాఠశాలకు వచ్చి ఫేషియల్ యాప్ లో హాజరు వేయబోయారు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి ఫోటోకు ఇప్పటి గుండుతో ఉన్న ఫోటోకు తేడా ఉండటంతో ఆ యాప్ ఇతని అటెండెన్స్ ను రిజెక్ట్ చేసింది. దీనిపై టీచర్ ఆదినారాయణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో కథ అయిపోలేదు. ఈ విషయం ఎలాగో మీడియాకు తెలిసింది. ఛానల్స్ లో, పత్రికల్లో వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజనులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ఆయన ఉద్యోగానికే ఎసరు తెచ్చింది.

అసలు ఈ విషయం మీడియాకు, సోషల్ మీడియాకు ఎలా ఎక్కిందని అధికారులు ఆదినారాయణను ప్రశ్నించారు. తనకే పాపం తెలియదని ఆయన మొత్తుకున్నా వినిపించుకోని అధికారులు దీనిపై విచారణ చేపట్టి ఈ నెల 17న ఆయనకు మెమో జారీచేశారు. దీనికి ఆయన క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. క్లారిఫికేషన్ నచ్చని అధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆడలేక మద్దెలోడు అన్నట్టు అసలు లోపం యాప్ లో ఉంటే దానిపై విచారణ జరిపించడమో , యాప్ ను సరిచేయించడమో చేయకుండా టీచర్ పై చర్యలు తీసుకోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News