వాలంటీర్లపై చంద్రబాబువి దొంగనాటకాలు - కొడాలి

ఐదేళ్ళుగా ప్రజల అవసరాలు తీరుస్తూ సేవలు అందిస్తున్న వాలంటీర్లపై గతంలో చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారని.. ఇప్పుడు యూటర్న్ తీసుకొని జీతాలు పెంచుతామంటే ఎవరూ నమ్మరన్నారు నాని.

Advertisement
Update: 2024-03-27 11:08 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నాని.. అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. ఒంటరిగా పోటీ చేస్తే గెలవనని తెలిసే ఇంటికి వెళ్లి మరి పవన్ కల్యాణ్‌ కాళ్లు పట్టుకున్నాడన్నారు. అందితే జుట్టు, లేదంటే కాళ్లు పట్టుకునే నైజం చంద్రబాబుదన్నారు.

వాలంటీర్లపై చంద్రబాబు యూటర్న్.. ఓ దొంగ నాటకమన్నారు నాని. వాలంటీర్ల పేరు చెబితేనే చంద్రబాబు వణికిపోతున్నారన్నారు. వాలంటీర్‌ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు నాని. చదువుకున్న, యువకులైన వాలంటీర్లకు ఏది మంచో తెలుసని, అదే వాళ్లు ప్రజలకు చెబుతారన్నారు నాని.

ఐదేళ్ళుగా ప్రజల అవసరాలు తీరుస్తూ సేవలు అందిస్తున్న వాలంటీర్లపై గతంలో చంద్రబాబు, పవన్ నోటికొచ్చినట్లు అవమానకరంగా మాట్లాడారని.. ఇప్పుడు యూటర్న్ తీసుకొని జీతాలు పెంచుతామంటే ఎవరూ నమ్మరన్నారు నాని. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలు ఇస్తాడని ఆరోపించారు. ఇప్పుడున్న వాలంటీర్లను ఇంటికి పంపి.. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడంటూ ఆరోపణలు చేశారు.

Tags:    
Advertisement

Similar News