మళ్లీ నేనే.. ధర్మాన ముందు చూపు

వయోభారంతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సీఎం జగన్ కి చెప్పానని, కానీ ఆయన తననే పోటీ చేయాలని ఒప్పించారని చెప్పుకొచ్చారు ధర్మాన. ఆయన మాట కాదనలేకపోయానని అన్నారు.

Advertisement
Update: 2023-01-04 08:54 GMT

ఏపీలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో అంతర్గత రాజకీయాలు కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈసారి టీడీపీ యువతకు పెద్దపీట వేస్తానంటోంది. వైసీపీ మాత్రం సీనియర్లను మార్చే ఆలోచనలో లేదు. అదే సమయంలో పార్టీని ధిక్కరిస్తే మాత్రం సీనియర్లు, జూనియర్లు అని చూడకుండా చెక్ పెట్టేస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో సీనియర్ అయిన ఆనం రామనారాయణ రెడ్డికి బలవంతంగా రిటైర్మెంట్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ పార్టీ ఇన్ చార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు ఖరారు చేశారు.

ఏపీలో మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా మాట్లాడినా వెంటనే అక్కడ ఓ ఇన్ చార్జ్ ని రంగంలోకి దింపుతారనే భయం ఎమ్మెల్యేలకు వచ్చేసింది. ఈ దశలో కొన్నాళ్లుగా ఉత్తరాంధ్రపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు తన టికెట్ తానే కన్ఫామ్ చేసుకున్నారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యేగా మళ్లీ తానే పోటీ చేస్తానన్నారు.

పరోక్షంగా సీటు కన్ఫామ్..

వయోభారంతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని సీఎం జగన్ కి చెప్పానని, కానీ ఆయన తననే పోటీ చేయాలని ఒప్పించారని చెప్పుకొచ్చారు ధర్మాన. ఆయన మాట కాదనలేకపోయానని, కానీ ఇంకా టైమ్ ఉంది కదా, నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తనను సీఎం జగన్ బలవంతంగా పోటీకి ఒప్పించారని కార్యకర్తలు, నేతలకు చెబుతున్నారు ధర్మాన.

ఇటీవల ధర్మాన ప్రసాదరావు కూడా వైసీపీకి పంటికింద రాయిలా తయారయ్యారు. విశాఖకు రాజధాని రాకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికోసం తాను రాజీనామా చేస్తానన్నారు. పదే పదే ఉత్తరాంధ్ర పేరుతో వార్తల్లో వ్యక్తిగా మారారు ధర్మాన. అయితే ఆయన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్ గా పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకున్నా కూడా తనకు ముప్పేమీ రాకుండా ముందుగా ఓ మాట వేసేశారు ధర్మాన.

శ్రీకాకుళంలో పోటీ చేయడం తనకు ఇష్టం లేకున్నా జగనే తనని బలవంత పెడుతున్నారని అన్నారు. అన్నట్టు అక్కడ ఆయన కొడుకు రామ్ మనోహర్ నాయుడు కూడా చురుగ్గా పార్టీ తరపున పని చేస్తున్నారు. కొడుకు టికెట్ కోసం తండ్రి త్యాగం చేస్తానన్నారే కానీ, కొత్తవారికి అవకాశం ఇద్దామని కాదు. పనిలో పనిగా ఇప్పుడు జగన్ పైనే భారం వేసేశారు. ఆయనే తమకి శ్రీకాకుళం రాసిచ్చేశారన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు ధర్మాన.

Tags:    
Advertisement

Similar News