"జగనన్నకు చెబుదాం".. డైరెక్ట్ గా సీఎం తోనే

నవరత్నాల కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నా.. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు గడప గడప కార్యక్రమంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని అసంతృప్తి ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేయబోతున్నారట సీఎం జగన్.

Advertisement
Update: 2022-10-31 12:54 GMT

ఏపీలో జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న గోరుముద్ద.. ఇలా జగన్ పేరుతో చాలా పథకాలున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది పథకం లెక్కలోకి రాదు కానీ దీనికి కూడా జగనన్న ట్యాగ్ లైన్ చేర్చారు. "జగనన్నకు చెబుదాం" అనే పేరుతో కొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. గతంలో చంద్రబాబు చేసిన తప్పుల్ని తాను చేయకుండా ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తున్న జగన్, నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు వినేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సమస్యలన్నిటినీ జగన్ ఫోన్ కాల్ ద్వారా వింటారన్నమాట.

ప్రజల నుంచి స్పందన అర్జీలు అధికారులు స్వీకరించినట్టు జగన్ నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. దీనికోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి వచ్చే కాల్స్ ని రికార్డ్ చేసి ర్యాండమ్ గా జగన్ కి వినిపిస్తారు అధికారులు. వాటిని అధికారులు ఫిల్టర్ చేస్తే అసలు సమస్యలు మరుగునపడిపోయే అవకాశముందని జగన్ ఆలోచిస్తున్నారట. అందుకే ఆయన నేరుగా ఆ కాల్స్ నుంచి కొన్నిటిని స్వయంగా తానే వినాలనుకుంటున్నారట. దీనికి సంబంధించిన విధి విధానాలపై ఈరోజు అధికారులతో చర్చించారు సీఎం జగన్.

నవరత్నాల కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తున్నా.. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు గడప గడప కార్యక్రమంలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని అసంతృప్తి ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేయబోతున్నారట సీఎం జగన్. సంక్షేమ పథకాల అమలు తీరు, వాటి లోటుపాట్లు, మెరుగు పరుచుకునేందుకు సూచనలు.. ఇలా ప్రజలనుంచి వివరాలు సేకరించబోతున్నారు. జగనన్నకు చెబుదాం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయబోతున్నారు.

ఎమ్మెల్యేలపై కూడా నజర్..

ఎమ్మెల్యేల గురించిన ఫీడ్ బ్యాక్ ఇప్పటికే సర్వే సంస్థల ద్వారా సేకరిస్తున్న సీఎం జగన్, ఈ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేల పనితీరు కూడా అంచనా వేయబోతున్నారు. కొంతమంది సామాజిక మాధ్యమాల ద్వారా ఆహా ఓహో అనుకునే విధంగా ప్రచారం చేయించుకుంటున్నారు. తీరా ప్రజల్లో వారి పట్ల సానుకూల ధోరణి ఉండటం లేదు. ఇలాంటి వాటిని కూడా జగన్ పట్టి పట్టి చూడబోతున్నారు. ఎన్నికలనాటికి ఎలాంటి మార్పులు తీసుకు రావాలి, ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవర్ని మార్చాలి అనే విషయాన్ని కూడా దీని ద్వారా తేల్చేస్తారు.

Tags:    
Advertisement

Similar News