చంద్రబాబు జీవితంలో ఇదే మొదటిసారా..?

టికెట్లు ప్రకటించటంలో అభ్యర్థులను మానసికంగా ర్యాగింగ్ చేసే చంద్రబాబు రాబోయే ఎన్నికలకు నోటిఫికేషన్ కు ముందే టికెట్లను ప్రకటిస్తున్నారంటే చాలామంది తమ్ముళ్ళు నమ్మలేకపోతున్నారు.

Advertisement
Update: 2024-03-15 06:11 GMT

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే అనుభవం చంద్రబాబునాయుడుకు చెప్పుకోవటానికి తప్ప దేనికి ఉపయోగపడదు. ఏ విషయంలో అయినా తాత్సారం తప్ప వెంటనే నిర్ణయాలు తీసుకోవటం అన్నది ఉండదు. అలాంటి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో మొదటిసారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే 128 మంది అభ్యర్థులను ప్రకటించారు. 20 రోజుల క్రితమే మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించగా గురువారం రెండోజాబితాలో మరో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 16 మంది అభ్యర్థులను కూడా వీలైనంత తొందరలోనే ప్రకటించేసే అవకాశముంది.

మామూలుగా చంద్రబాబు స్టైల్ ఏమిటంటే.. నామినేషన్ చివరిరోజుకు ముందు వరకు అభ్యర్థులను ప్రకటించకుండా అందరిని టెన్షన్లో పెట్టేస్తారు. ఉదాహరణకు 16వ తేదీ నామినేషన్ వేయటం మొదలవుతోందన్నా, చివరి రోజన్నా 15వ తేదీన అభ్యర్థులను ప్రకటించిన ఎన్నికలున్నాయి. దీనివల్ల ఏమయ్యేదంటే టెన్షన్ పడి పడి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్నా అభ్యర్థుల్లో సంతోషం కనబడేదికాదు. హడావుడిపడుతూ, చంద్రబాబును తిట్టుకుంటూ నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులున్నారు.

టికెట్లు ప్రకటించటంలో అభ్యర్థులను మానసికంగా ర్యాగింగ్ చేసే చంద్రబాబు రాబోయే ఎన్నికలకు నోటిఫికేషన్ కు ముందే టికెట్లను ప్రకటిస్తున్నారంటే చాలామంది తమ్ముళ్ళు నమ్మలేకపోతున్నారు. దీనికి చాలామంది తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే సమన్వయకర్తల పేరుతో జగన్ అభ్యర్థులను ప్రకటించటం దాదాపు రెండునెలల క్రితమే మొదలుపెట్టారు. ఒకవైపు జగన్ అభ్యర్థులను ప్రకటిస్తుంటే చంద్రబాబు మాత్రం తాత్సారం చేస్తున్నారంటూ తమ్ముళ్ళల్లో గోలపెరిగిపోయింది. దాంతో తాను కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని చంద్రబాబు ప్రకటించాల్సొచ్చింది. అందులోనూ రాబోయే ఎన్నికలు చంద్రబాబు, టీడీపీ జీవన్మరణ సమస్యగా మారింది.

గతంలోలాగ అభ్యర్థుల ప్రకటనను నాన్చినాన్చి చివరివరకు ప్రకటించకనపోతే ఫలితాలు రివర్సుకొట్టడం ఖాయమని అర్థ‌మైపోయింది. అందుకనే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందుగానే వీలైనంతమంది అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. మిగిలిన 16 నియోజకవర్గాల్లో కూడా కసరత్తు చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జి, బండారు సత్యనారాయణమూర్తి, దేవినేని ఉమ, బోడెప్రసాద్, ముళ్ళపూడి రేణుక, కళా వెంకటరావు, మీసాల గీత లాంటి కొందరు సీనియర్ల పరిస్థితి ఏమిటో అర్థంకావటంలేదు. గండి బాబ్జి పార్టీకి రాజీనామా చేసిన వెంటనే బుజ్జగించేందుకు కొందరు సీనియర్లను చంద్రబాబు రంగంలోకి దింపారని సమాచారం. ఏదేమైనా ముందుగానే అభ్యర్థులను ప్రకటించటం చంద్రబాబుకు ఇదే మొదటిసారనే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News