డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొందరు వైసీపీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి వాపోయారు. నియోజకవర్గంలోని ఒక మండలంలోని నాయకులు తనపై వ్యతిరేకంగా కుట్ర చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
Update: 2022-09-10 07:56 GMT

టీడీపీ చేస్తున్న విమర్శలపై మంత్రులెందుకు స్పందించడం లేదని వైసీపీ అగ్రనాయకత్వం ఆవేదన చెందుతుంటే.. మంత్రులు మాత్రం తమ నియోజకవర్గంలోని వైసీపీ నాయకులతోనూ వివాదాలు పరిష్కరించుకోలేకపోతున్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొందరు వైసీపీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి వాపోయారు. నియోజకవర్గంలోని ఒక మండలంలోని నాయకులు తనపై వ్యతిరేకంగా కుట్ర చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

భవిష్యత్తులో నిజంగానే జగన్‌మోహన్ రెడ్డి తనపై కోపం తెచ్చుకునే పరిస్థితిని సృష్టిస్తున్నారని చెప్పారు. పార్టీ శ్రేణులను, ప్రజలను రెచ్చగొడుతున్న వారు.. రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవాలన్నారు. లేకుంటే అలాంటి వారిని పార్టీనే బహిష్కరిస్తుందని హెచ్చరించారు. తనను అవమానించిన అంశం బయటకు వస్తే అది ఎంత దూరం వెళ్తుందో సదరు వైసీపీ నాయకుడికి అర్థం కావడం లేదన్నారు.

తాను ప్రజలకు గానీ, కార్యకర్తలకు గానీ చెడు చేసినా, రూపాయి లంచం తీసుకున్నా దాన్ని నిరూపించాలని.. తప్పు చేసినట్టు నిరూపిస్తే కాళ్లు పట్టుకునేందుకూ తాను సిద్ధమని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. ఎస్సీగా పుడితే బాగుండూ.. ఎమ్మెల్యే టికెట్ వచ్చేది అని గతంలోనూ సదరు మండల నాయకుడు మాట్లాడారని ఇది సరైన పద్దతి కాదన్నారు.

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రపై తాను స్పందించాలని అనుకోలేదని.. కానీ నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అంతా పెనుమూరు మండల కేంద్రానికి రావాలంటూ తనకు వ్యతిరేకంగా వాట్సాప్‌లో మేసేజ్‌లు పంపుతున్నారని అందుకే తాను స్పందించాల్సి వచ్చిందన్నారు. ఒకవైపు టీడీపీ నాయకులతో పోరాటం చేయాల్సిందిగా సీఎం జగన్‌ చెబుతుంటే.. మరోవైపు డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి సొంత నియోజకవర్గంలోని ఒక మండల స్థాయి నాయకులతో పోరాటం చేస్తుండడం వైసీపీలోని పరిస్థితికి అద్ధం పడుతోంది.

Tags:    
Advertisement

Similar News