ఏపీ కేబినెట్ భేటీ వాయిదా వెనుక కారణం అదేనా?

ఈ నెలాఖరున ప్రధాని అపాయింట్‌మెంట్ దొరికితే వైఎస్ జగన్ ఢిల్లీ ప్రయాణమవుతారు. అందుకే 29న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.

Advertisement
Update: 2022-08-25 05:16 GMT

ఏపీ కేబినెట్ భేటీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 నిర్వహించాలి. అయితే కొన్ని కారణాల వల్ల మంత్రి వర్గ సమావేశాన్ని సెప్టెంబర్ 1న ఉదయం 11.30 గంటలకు నిర్వహించనున్నట్లు సాధారణ పరిపాలన శాఖ తెలిపింది. 29వ తేదీ భేటీ కోసం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేశారు. అన్ని శాఖలకు దీనికి సంబంధించిన సమాచారం అందింది. ఈ మేరకు ఆయా శాఖ అధికారులు మంత్రులకు బ్రీఫ్ చేయడానికి సమాచారాన్ని సిద్దం చేస్తున్నారు. కానీ అకస్మాతుగా కేబినెట్ సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జీఏడీ కారణాలు వెల్లడించకపోయినా.. వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఉండొచ్చనే వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

గోదావరి వరదల సమయంలో సీఎం జగన్ పోలవరం ముంపు ప్రాంతాలను కూడా పర్యటించారు. ఆ సమయంలో నిర్వాసితులతో మాట్లాడుతూ నష్టపరిహారం చెల్లించడానికి భారీ మొత్తం అవసరం అవుతుందని, కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కానీ నష్టపరిహారం చెల్లించలేమని చెప్పారు. పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీ కింద రూ. 20 వేల కోట్లు అవసరం అని, వాటిని విడుదల చేయాలని సీఎం జగన్ ఇటీవల లేఖ రాశారు. ఢిల్లీలో ప్రధాని మోడీ, ఇతర కేంద్ర మంత్రులను కలసినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇక గురువారం ఢిల్లీలో విభజన సమస్యలపై కీలక సమావేశం జరుగనుంది. ఇందులో చాలా వాటికి పరిష్కారం లభిస్తుందని తెలుస్తోంది.

విభజన సమస్యల పరిష్కారం, పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీ కింద నిధులు విడుదలకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ కోరినట్లు రూ. 20వేల కోట్లు విడుదల చేయకపోయినా.. మంచి ప్యాకేజీ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇవ్వాళో, రేపో వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో మరోసారి ఢిల్లీ వెళ్లడానికి సీఎం జగన్ సిద్ధపడుతున్నారు. ఈ నెలాఖరున ప్రధాని అపాయింట్‌మెంట్ దొరికితే వైఎస్ జగన్ ఢిల్లీ ప్రయాణమవుతారు. అందుకే 29న జరగాల్సిన కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసినట్లు సమాచారం.

Tags:    
Advertisement

Similar News