అమరావతివాదుల విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు

అమరావతివాదుల విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది వరకు తామిచ్చిన ఆదేశాలను సవరించబోమని స్పష్టం చేసింది. గతంలో విధించిన షరతులకు లోబడే యాత్ర చేసుకోవాలని తేల్చిచెప్పింది.

Advertisement
Update: 2022-11-01 10:12 GMT

అమరావతివాదులకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. పాదయాత్రకు గతంలో విధించిన ఆంక్షలను సవరించాలంటూ అమరావతివాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఐడీ కార్డులున్న 600 మంది మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని... సంఘీభావం తెలిపేవారు కూడా రోడ్డు పక్కన నిలబడి సంఘీభావం తెలపాలని గతంలో కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలను పోలీసులు అమలు చేసేందుకు ప్రయత్నించగా... కేవలం 70 మంది మాత్రమే అమరావతివాదులని తేలింది.

మిగిలిన వారంతా ఎక్కడికక్కడ యాత్రలో పాల్గొంటున్న స్థానికులేనని పోలీసులు నిర్ధారించారు. దాంతో యాత్రను ఆపేసిన అమరావతివాదులు... తాము 2000 మంది పేర్లు ఇస్తామని.. వారిలో 600 మంది విడతలవారీగా వీలుబట్టి రొటేషన్ పద్ధ‌తిలో యాత్ర చేసేలా ఆంక్షలను సవరించాలని కోర్టుకు వెళ్లారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారు యాత్రకు ముందు గానీ, వెనుక గానీ నడిచేలా అవకాశం ఇవ్వాలంటూ కోరారు.

అదే సమయంలో అమరావతివాదులు నిబంధనలను ఉల్లంఘించి యాత్ర చేస్తున్నారని.. తొడలు కొడుతూ రెచ్చగొడుతున్నారని.. కాబట్టి యాత్రనే రద్దు చేయాలంటూ డీజీపీ కూడా కోర్టును కోరారు. ఈ పిటిషన్లు విచారించిన కోర్టు.. ఇది వరకు తీర్పును వాయిదా వేసింది. తాజాగా అమరావతివాదుల విజ్ఞప్తి తోసిపుచ్చుతూ తీర్పు ఇచ్చింది. ఇది వరకు తామిచ్చిన ఆదేశాలను సవరించబోమని స్పష్టం చేసింది. గతంలో విధించిన షరతులకు లోబడే యాత్ర చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఐడీ కార్డులు ఉన్నవారే పాదయాత్రలో పాల్గొనాలని, 600 మందికి గుర్తింపు కార్డులు జారీ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. పోలీసులు అడిగినప్పుడు ఐడీ కార్డులుచూపించాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. పాదయాత్రను నిలుపుదల చేయాలన్న డీజీపీ పిటిషన్‌ను కూడా కోర్టు తోసిపుచ్చింది.

Tags:    
Advertisement

Similar News