నా కుర్చీ కిందకు నీళ్లు.. మరోసారి ఆనం సంచలన వ్యాఖ్యలు

గడప గడప కార్యక్రమంలో తనకి టీ ఇచ్చేవారు.. ఎమ్మెల్యేకి ఇస్తున్నామో లేక దారినపోయే దానయ్యకు ఇస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఏది ఏమైనా మరో ఏడాదిపాటు వెంకటగిరికి తానే ఎమ్మెల్యేనన్నారు ఆనం.

Advertisement
Update: 2022-12-29 13:35 GMT

వైసీపీకి స్వపక్షంలో విపక్షంలా తయారైన మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందే తన కుర్చీ కిందకు నీళ్లొస్తున్నాయని, తన ఎమ్మెల్యే సీటుకే కొంతమంది ఎసరు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారాలను కాస్త అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నియోజకవర్గ పరిశీలకుల్ని కోరారు. గడప గడప కార్యక్రమంలో తనకి టీ ఇచ్చేవారు.. ఎమ్మెల్యేకి ఇస్తున్నామో లేక దారినపోయే దానయ్యకు ఇస్తున్నామో తెలియని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఏది ఏమైనా మరో ఏడాదిపాటు వెంకటగిరికి తానే ఎమ్మెల్యేనన్నారు. ఆ తర్వాత ఆ సీటుకి ఎవరైనా పోటీ పడొచ్చని చెప్పారు.

ఆనం వర్సెస్ నేదురుమల్లి..

నెల్లూరులో పేరున్న ఆనం కుటుంబం, నేదురుమల్లి కుటుంబాల మధ్య గతంలోనూ విభేదాలుండేవి. నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి 2024లో వెంకటగిరి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి అధిష్టానంతో సఖ్యత లేకపోవడంతో, రామ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై పరోక్షంగా రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఎవరు పడితే వారు టికెట్ నాది అని చెప్పుకుంటున్నారని, వారికి జగనన్న ముద్ర ఉండొచ్చేమో కానీ, తనకు ప్రజలు ఇచ్చిన రాజముద్ర ఉందని చెప్పారు. పరోక్షంగా పార్టీతో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమైనట్టు సంకేతాలిచ్చారు. తనకు ప్రజాభిమానం ఉందని, తాను ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు.

ఆనం పూర్తిగా రూటు మార్చినట్టేనా..?

అసలు మనం ఏం చేశామని ప్రజలు మనకు ఓట్లు వేస్తారు, కేవలం పెన్షన్లు ఇస్తే ఓట్లు పడతాయా అంటూ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు ఆనం. సొంత పార్టీనుంచే దీనిపై కౌంటర్లు పడ్డాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ఆనం ఎక్కడా ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వలేదు. కనీసం తన మాటల్ని వక్రీకరించారని కూడా చెప్పలేదు. పైగా ఈరోజు తన సీటు కిందకే నీళ్లు తెస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆనం ఎన్నికలకు ఏడాది ముందుగానే పార్టీతో తాడోపేడో తేల్చుకోడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News