అందరి దృష్టి జగన్ పైనేనా?

రిజర్వేషన్ల కోసం కాపులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ అమలు చేయకపోతే రేపటి ఎన్నికల్లో వైసీపీపై ఆ ప్రభావం పడటం ఖాయం. ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తాయి. అందుకనే ఇప్పుడు అందరి చూపు జగన్‌పైనే నిలిచింది.

Advertisement
Update: 2022-12-22 05:37 GMT

ఇప్పుడంద‌రి దృష్టి జగన్మోహన్ రెడ్డిపైనే నిలిచింది. అగ్రవర్ణాల్లోని పేదలకు (ఈడ‌బ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రాలకే ఉందని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అగ్రవర్ణాల్లోని పేదల్లో ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనే అధికారాలన్నీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని, ఇందులో కేంద్రం జోక్యం కానీ అనుమతి కానీ అవసరమే లేదని తేల్చేసింది. ఇప్పుడీ అంశమే రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారబోతోంది.

దీనికి కారణం ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు 10 శాతం ఈడ‌బ్ల్యూఎస్‌ రిజర్వేషన్లలో 5 శాతాన్ని చంద్రబాబునాయుడు కాపులకు కేటాయించారు. నిజానికి అప్పట్లో చంద్రబాబు చేసింది అచ్చంగా రాజకీయ నిర్ణయమే. కాపులను బీసీల్లో చేరుస్తానని హామీ ఇచ్చి ఫెయిలైన చంద్రబాబు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను తనకు అనుకూలంగా మలచుకున్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ నిర్ణయం తీసుకున్నారే కానీ అమల్లోకి మాత్రం తేలేదు.

నిర్ణయం అమలు చేయటంలో జాప్యం జరగటంతో ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారటంతో ఆ విషయం మరుగునపడిపోయింది. అధికారంలోకి వచ్చిన జగన్ కూడా కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయలేదు. అగ్రవర్ణాల్లోని పేదలందరికీ కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ సౌకర్యంలో కాపులకు మాత్రమే 5 శాతం రిజర్వేషన్ ఇవ్వటం సాధ్యం కాదని జగన్ అభిప్రాయపడ్డారు. అంటే జగన్ ఉద్దేశం ఏమిటంటే అగ్రవర్ణాల జనాభా నిష్పత్తి ప్రకారమే 10 శాతం రిజర్వేషన్లు సర్దుబాటు చేయాలని.

అయితే జగన్ ఆలోచన కార్యరూపంలోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జనాభా లెక్కలు తీస్తేకానీ జనాభాలో ఎవరి శాతం ఎంతో తేలదు. ఆపని చేయాల్సింది కేంద్రమే కానీ రాష్ట్రం కాదు. దాంతో 10 శాతం రిజర్వేషన్ అంశం మూలనపడిపోయింది. మరిప్పుడు కేంద్రం తాజా ప్రకటనతో జగన్ ఏమి చేస్తారు? అన్నది కీలకమైంది. ఎందుకంటే తొందరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. రిజర్వేషన్ల కోసం కాపులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాపులకు రిజర్వేషన్ అమలు చేయకపోతే రేపటి ఎన్నికల్లో వైసీపీపై ఆ ప్రభావం పడటం ఖాయం. ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తాయి. అందుకనే ఇప్పుడు అందరి చూపు జగన్‌పైనే నిలిచింది.

Tags:    
Advertisement

Similar News