శ్రీ‌వారి మెట్ల మార్గం పునఃప్రారంభం..!

గత ఏడాది నవంబర్ 18, 19వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. వరదనీటితో తిరుపతి నగరం మునిగిపోయింది. తిరుమలలో కూడా వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు, కట్టడాలు, తిరుమలకు చేరుకునే ఘాట్ రోడ్డు, నడక దారి మార్గాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

Advertisement
Update: 2022-05-05 05:09 GMT

గత ఏడాది నవంబర్ 18, 19వ తేదీల్లో తిరుపతి, తిరుమలలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. వరదనీటితో తిరుపతి నగరం మునిగిపోయింది. తిరుమలలో కూడా వర్ష బీభత్సం సృష్టించింది. భారీ వృక్షాలు, కట్టడాలు, తిరుమలకు చేరుకునే ఘాట్ రోడ్డు, నడక దారి మార్గాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందుగా ఘాట్ రోడ్డు, అలిపిరి మెట్ల మార్గానికి మరమ్మతులు చేపట్టి ప్రారంభించిన టీటీడీ తాజాగా శ్రీవారి మెట్టు మార్గాన్ని కూడా ప్రారంభించింది.

భారీవర్షాలకు శ్రీవారి మెట్టు మార్గంలో పెద్ద పెద్ద బండరాళ్లు కూలి పడటంతో నడకదారి పూర్తిగా ధ్వంసం అయిపోయింది. నాలుగు నెలల పాటు జరిగిన మరమ్మతు పనులు పూర్తి కావడంతో శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభమైంది. శ్రీ‌వారి మెట్ల దారిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం శాస్త్రోక్తంగా పూజ‌లు నిర్వహించి పునఃప్రారంభించారు.

అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ‌త ఏడాది నవంబ‌రు 18, 19న కురిసిన భారీ వ‌ర్షాల‌తో నడకదారి పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పారు. పెద్ద బండ‌రాళ్లు పడటంతో మెట్లు, ఫుట్‌పాత్‌లు, మ‌రుగుదొడ్లు దెబ్బతిన్నాయన్నారు. రూ.3.60 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేశామని తెలిపారు. కేవ‌లం నాలుగు నెల‌ల్లోనే మరమ్మతులు చేసిన ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది కాంట్రాక్టర్లను ఆయన అభినందించారు.ఈ మార్గం గుండా ప్రతిరోజు ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భ‌క్తులు తిరుమ‌ల‌కు చేరుకుంటారని ఆయన చెప్పారు.

శ్రీవారి మెట్టు మార్గం అతి పురాతనమైనది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఈ మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నట్లు శాసనాల ద్వారా వెల్లడవుతోంది. శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ మార్గం ద్వారానే కొండకు చేరుకునే వారు. అలిపిరి నడక మార్గం, తిరుమలకు రోడ్డు వ్యవస్థ లేనప్పుడు భక్తులు ఎక్కువగా ఈ మార్గం ద్వారానే తిరుమలకు చేరుకునే వారు. అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకోవాలంటే సుమారు నాలుగు వేలకు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.

అదే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కేవలం 2250 మెట్లు ఎక్కడం ద్వారా తిరుమలకు చేరుకోవచ్చు. అందుకే దట్టమైన అటవీ ప్రాంతం అయినప్పటికీ ఈ మార్గం గుండా తిరుమలకు చేరుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతుంటారు. నాలుగు నెలల తర్వాత తిరిగి శ్రీవారి మెట్టు మార్గం ప్రారంభం కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News