మాటల యుద్ధం నుంచి చేతల యుద్ధం వరకు..

పవన్ కల్యాణ్ తో వైసీపీ మాటల యుద్దం చివరకు చేతల వరకు వెళ్లింది. పవన్ అభిమానులు తన సెల్ ఫోన్ కి అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి బయటకు వచ్చిన అనంతరం ఆయనపై కొంతమంది పవన్ అభిమానులు దాడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ వాహనంలో పోసానిని ఆయన నివాసానికి తరలించారు. రెండు రోజుల క్రితం రిపబ్లిక్ సిినిమా ప్రీ రిలీజ్ […]

Advertisement
Update: 2021-09-28 22:25 GMT

పవన్ కల్యాణ్ తో వైసీపీ మాటల యుద్దం చివరకు చేతల వరకు వెళ్లింది. పవన్ అభిమానులు తన సెల్ ఫోన్ కి అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నారంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి బయటకు వచ్చిన అనంతరం ఆయనపై కొంతమంది పవన్ అభిమానులు దాడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ వాహనంలో పోసానిని ఆయన నివాసానికి తరలించారు.

రెండు రోజుల క్రితం రిపబ్లిక్ సిినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న పవన్ కల్యాణ్ ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం అనవరసం అని విమర్శించారు. అదే సమయంలో మంత్రి పేర్ని నానిపై కూడా పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మొదలైన మాటల యుద్ధాన్ని వైసీపీ మంత్రులు కొనసాగించారు. ఒక్కొక్కరే ప్రెస్ మీట్ నిర్వహించి పవన్ వ్యాఖ్యలను ఖండించారు. ఇండస్ట్రీని కాపాడాలంటే పవన్ లాంటి హీరోలు ముందు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని, సినిమా సినిమాకీ టికెట్ల రేట్లు ఇష్టారీతిన పెంచడం సరికాదని, దాన్ని క్రమబద్ధీకరించేందుకే ప్రభుత్వం టికెటింగ్ వ్యవస్థను ఆన్ లైన్ చేయబోతోందని వివరణ ఇచ్చారు. అయితే వైసీపీ విమర్శలకు మరోసారి పవన్ ట్విట్టర్ లో బదులిచ్చారు. ఆ వెంటనే పేర్ని నాని కూడా పవన్ ట్వీట్ కి కౌంటర్ గా మరో ట్వీట్ వేయడంతో ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. అయితే వైసీపీ మంత్రులతోపాటు నటుడు, వైసీపీ అభిమాని పోసాని కృష్ణమురళి కూడా స్పందించడంతో కలకలం రేగింది.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలను పోసాని ప్రస్తావించడంతో జనసైనికులు, పవన్ అభిమానులు ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆయనకు ఫోన్ కాల్స్ చేయసాగారు. ఈ ఫోన్ కాల్స్ తో విసుగొస్తోందని, అసభ్యకర మెసేజ్ లు పంపిస్తున్నారంటూ మరోసారి పోసాని ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి మరింత ఘాటుగా మాట్లాడారు. దీంతో పవన్ అభిమానులు ప్రెస్ మీట్ పూర్తయి బయటకు రాగానే పోసానిపై దాడికి ప్రయత్నించారు. చివరకు పోలీసులు ఆయనను సురక్షితంగా ఇంటికి చేర్చారు. తనకు ప్రాణహాని ఉందని, పవన్ పై తాను పోలీస్ కేసు పెడతానని చెప్పారు పోసాని కృష్ణమురళి.

Tags:    
Advertisement

Similar News