2014 స్ట్రాటజీనే... తటస్త శక్తులను సమీకరిస్తున్న చంద్రబాబు

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓటమి ఖాయమనుకున్న సమయంలో 2014 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చంద్రబాబు వేసిన ఎత్తులు అప్పట్లో బాగానే ఫలితాన్నిచ్చాయి. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్‌కు చెందిన జిల్లా స్థాయి నేతలు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. అయితే వాళ్ళు కోరిన కోరికలు ఎవరూ తీర్చేవి కాదు. వాళ్ళకు జగన్ టిక్కెట్ ఇస్తానన్నా […]

Advertisement
Update: 2019-01-07 22:54 GMT

ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓటమి ఖాయమనుకున్న సమయంలో 2014 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు చంద్రబాబు వేసిన ఎత్తులు అప్పట్లో బాగానే ఫలితాన్నిచ్చాయి. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని ఫాలో అవుతున్నారు.

2014 ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్‌కు చెందిన జిల్లా స్థాయి నేతలు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపారు. అయితే వాళ్ళు కోరిన కోరికలు ఎవరూ తీర్చేవి కాదు. వాళ్ళకు జగన్ టిక్కెట్ ఇస్తానన్నా మాకే కాదు మా గ్రూపుకంతా ఇవ్వాలి అన్నట్లుగా షరతులు పెట్టారు. దానికి జగన్‌ నుంచి సరైన స్పందన రాలేదు. అలాంటి వారిలో జేసీ, గంటా లాంటి కీలక నేతలు ఉన్నారు. అలా వైసీపీ వదిలేసిన నేతలను చంద్రబాబు చేరదీసి పార్టీలో చేర్చుకున్నారు. పక్కాగా వ్యూహాన్ని అమలు చేసి గెలుపు తీరాన్ని చేరారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే చేయబోతున్నారు.

తటస్తంగా ఉంటున్న కీలక నేతలకు గాలం వేస్తున్నారు. వైసీపీలో నిరాదరణకు గురైన వారిని గుర్తించి పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. చంద్రబాబును ధిక్కరించే పరిస్థితి పార్టీలో ఏ నేతకు లేకపోవడం కూడా టీడీపీకి కలిసి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు… కొత్తగా పార్టీలోకి ఎవరు వచ్చినా అభ్యంతరం చెప్పడానికి వీల్లేదని ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టంగా చెప్పేశారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉత్తరాంధ్రలో కీలకమైన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను టీడీపీలో చేర్చుకోబోతున్నారు. వైఎస్‌కు అత్యంత ఆప్తుడిగా ఉంటూ వచ్చిన కొణతాల తొలుత జగన్‌ వెంట నడిచి … అక్కడి పోకడలు నచ్చక బయటకు వచ్చేశారు. ఆయన సంక్రాంతి తర్వాత టీడీపీలో చేరబోతున్నారు. మాజీ ఎంపీ సబ్బంహరి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

దాడి వీరభద్రరావు విషయంలో పార్టీలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. దాంతో ఆయన జనసేన వైపు వెళ్తారా లేక టీడీపీ వైపు వస్తారా అన్నది తెలియడం లేదు. ఇక సూపర్ స్టార్‌ కృష్ణ సోదరుడు, హీరో మహేష్‌ బాబు బాబాయ్‌ అయిన ఆదిశేషగిరి రావు కూడా వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారు.

గుంటూరు ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు జగన్ నిరాకరించడంతో ఆయన పార్టీ వీడుతున్నారు. ఇప్పటి వరకు చిత్రపరిశ్రమ నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్నది అంతో ఇంతో కృష్ణ ఫ్యామిలీనే.

ఇప్పుడు ఆదిశేషగిరి రావును టీడీపీలో చేర్చుకోవడం ద్వారా వైసీపీని మానసికంగా దెబ్బతీసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఆదిశేషగిరిరావు మరికొద్ది రోజుల్లోనే టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇలాంటి కీలక వ్యక్తులే కాకుండా నియోజక వర్గాల్లో ఫలితాలను తారుమారు చేసే సామర్థ్యం ఉన్న తటస్తులకు, వైసీపీలో నిరాదరణకు గురవుతున్న నేతలకు టీడీపీ వలవేయబోతోంది.

Tags:    
Advertisement

Similar News