జగన్‌, వైఎస్‌ను పోల్చే విధానం అది కాదు... పవన్‌ను పిలవడాన్ని జగన్‌కు చెప్పా...

వైఎస్‌తో పోలిస్తే జగన్‌ పనితీరు ఆ స్థాయిలో ఉండడం లేదన్న విమర్శలపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. వైఎస్‌ఆర్‌ను జగన్‌ను పోల్చి చూస్తున్న విధానంలోనే పొరపాటు ఉందన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో వైఎస్ తీరు ఎలా ఉంది… ఇప్పుడు జగన్‌ తీరు ఎలా ఉంది అన్న కోణంలో పోల్చి చూడాలే గానీ… వైఎస్ఆర్ అంతిమ దశను జగన్‌ ప్రారంభ దశతో పోల్చి చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. . వైఎస్‌ తన సుధీర్ఘ […]

Advertisement
Update: 2016-08-25 00:03 GMT

వైఎస్‌తో పోలిస్తే జగన్‌ పనితీరు ఆ స్థాయిలో ఉండడం లేదన్న విమర్శలపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. వైఎస్‌ఆర్‌ను జగన్‌ను పోల్చి చూస్తున్న విధానంలోనే పొరపాటు ఉందన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో వైఎస్ తీరు ఎలా ఉంది… ఇప్పుడు జగన్‌ తీరు ఎలా ఉంది అన్న కోణంలో పోల్చి చూడాలే గానీ… వైఎస్ఆర్ అంతిమ దశను జగన్‌ ప్రారంభ దశతో పోల్చి చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. . వైఎస్‌ తన సుధీర్ఘ ప్రయాణంలో ఎంతో అనుభవం సంపాదించుకున్నారని అంబటి చెప్పారు.

వైఎస్ రాజకీయ ప్రారంభ దశ చాలా బలహీనంగా ఉండేదన్నారు. జగన్ రాజకీయ ప్రారంభం మాత్రం చాలా శక్తివంతంగా ఉందన్నారు. జగన్‌కు తన తండ్రి వయసు వచ్చే సమయానికి ఒక అద్భుతమైన పర్సనాలిటీని జనం చూస్తారన్నారు. జగన్‌కు వైఎస్‌ కంటే ఓపిక ఎక్కువగా ఉందన్నారు. జగన్ ఐదు నిమిషాలు మాట్లాడినా ఆ మాటల్లో క్వాలిటీ ఉంటుందని చెప్పారు. జగన్‌ దగ్గర నాన్చుడు ధోరణి ఉండదని అప్పటికప్పుడే ఏదైనా తేల్చేస్తారన్నారు. వైఎస్ ఒక మాట ఇస్తే వ్యక్తిగతంగా తాను నష్టపోయినా సరే మాట నిలబెట్టుకునే గుణాన్ని తాను చూశానన్నారు. వైఎస్‌ కల్మషం లేని వ్యక్తి అని అన్నారు. అప్పట్లో వంగవీటి రంగాకు వైఎస్‌ మద్దతు గట్టిగా ఉండేదన్నారు.

వైఎస్ చాలాకాలం పాటు ముఖ్యమంత్రి కాకపోవడానికి కారణం ఆయనకున్న ఫాలోయింగేనని అంబటి అభిప్రాయపడ్డారు. సొంత ఫాలోయింగ్ ఉన్న నేతను ముఖ్యమంత్రిగా చేసేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ ఇష్టపడదన్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా వైఎస్‌ఆర్‌ చాలా గౌరవం ఇచ్చేవారని చెప్పారు. 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా వైఎస్ కోరినా తానే వద్దని చెప్పానన్నారు. 1999లో కాంగ్రెస్‌ గెలిచిపోయినట్టేనని భావించామని కానీ ఫలితం మరోలా వచ్చిందన్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ తమకు అలాంటి అనుభవమే ఎదురైందని చెప్పారు. బహుశా అప్పట్లో వైఎస్ ఐదేళ్లు ప్రతిపక్షంలో పోరాడాల్సిందిగా తీర్పు చెప్పిన జనం… జగన్‌ విషయంలోనూ అలాంటి తీర్పే ఇచ్చారనిపిస్తోందన్నారు.

వైసీపీ కరిగిపోయే ఐస్‌ క్రీం అనుకుని నాకేద్దామనుకుంటే సోనియా గాంధీ, రఘువీరారెడ్డి మూతులు కాలిపోతాయన్నారు. వైసీపీ ఐస్ క్రీం కాదు ఒక నిప్పు అని అంబటి చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబులాగా పొలిటికల్ ట్రిక్స్‌ను జగన్ ప్లే చేయలేదని చెప్పారు. డబ్బుతోనే గెలిచేస్తామనుకుంటే చంద్రబాబుతో ఎవరూ పోటీ పడే పరిస్థితి ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో వేల కోట్లు కుమ్మరించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, కానీ ప్రజా తీర్పును డబ్బుతో కొనడం సాధ్యం కాదన్నారు. ఏపీలో డబ్బు రాజకీయాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్‌, వైఎస్‌లు కాదని… చంద్రబాబు వల్లే ధన రాజకీయం మొదలైందని విమర్శించారు. తన ముగ్గురు కుమార్తెలు ఎంబీబీఎస్‌ పూర్తి చేశారంటే అందుకు వైఎస్‌ చేసిన సాయమే కారణమని చెప్పారు. వైఎస్ లేకుంటే తన కూతుర్లు డాక్టర్లు అయ్యే వారు కాదేమోనన్నారు. తన కూతురు వివాహానికి పవన్‌కల్యాణ్‌ను కుటుంబసభ్యుల కోరిక మేరకు ఆహ్వానించానని చెప్పారు. ఎందుకైనా మంచిదని ఈ విషయాన్ని జగన్‌ వద్ద కూడా ప్రస్తావించానన్నారు. అందుకు జగన్ ”భలే వారన్నా పెళ్లికి పిలిస్తే తప్పేంటి” అని అన్నారని చెప్పారు. పార్టీలు వేరైనా ఇలాంటి కార్యక్రమాల్లో అన్ని పార్టీల వారు కలిసే వాతావరణం రావాలన్నారు.

వైసీపీ బలహీనపడి ఉంటే ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని అంబటి ప్రశ్నించారు. వారిని రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తే ఒక్కరు కూడా గెలవరన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసని అందుకే వెనుకడుగు వేస్తున్నారని చెప్పారు. చార్జిషీట్ వేయకుండా ఒక వ్యక్తిని 16 నెలలు జైల్లో పెట్టిన చరిత్ర దేశంలో ఉందా అని ప్రశ్నించారు. ఇష్టానుసారం చట్టాలను ఉల్లంఘించి సోనియా, చంద్రబాబు కుమ్మకై జగన్‌ను జైలుకు పంపారని ఆరోపించారు. తనను ఎమార్ కేసులో విచారణకు పిలిచినప్పుడు కూడా అరెస్ట్‌ చేసినా సరే అన్నట్టుగానే మానసికంగా సిద్ధపడి వెళ్లానన్నారు. వెంకయ్యనాయుడు సాయంతో కేసీఆర్‌తో ఒప్పందం కుదుర్చుకునే ఓటుకు నోటు కేసు నుంచి చంద్రబాబు బయటపడ్డారన్నారు అంబటి. వైఎస్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ముద్రగడ దీక్ష సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు కూడా అలాంటి బాధనే కలిగించిందన్నారు. కాపు సామాజికవర్గాన్ని చంద్రబాబు దారుణంగా అణచివేస్తుంటే కాపు నాయకులంతా ఒకటి కాకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. కాపు అన్న ప్రతివాడి ఇంటి ముందు పోలీసులను మోహరించడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు అంబటి.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News