టాలీవుడ్ రివ్యూ 2015 " మరణాలు          

ప్రతి ఏటా తెలుగు చిత్రసీమలో ఏడాది సమీక్షలంటే హిట్-ఫ్లాపులు మాత్రమే చూశాం. కానీ 2015లో మాత్రం టాలీవుడ్ కు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నడూ లేనివిధంగా అత్యధిక మరణాలు 2015లోనే సంభవించాయి. మరీ ముఖ్యంగా హాస్యనటులకు సంబంధించి ఒక శకానికి శకమే ముగిసిందని చెప్పాలి. టాలీవుడ్ లో ఊహించని మరణాలపై ఓ అవలోకనం. 2015 లో ఆహుతి ప్రసాద్ అకాల మరణంతో బ్యాడ్ డేస్ ప్రారంభమయ్యాయని చెప్పాలి. అప్పటివరకు చలాకీగా కనిపించిన ఆహుతి ప్రసాద్ ఆకస్మికంగా ఈ […]

Advertisement
Update: 2015-12-28 19:03 GMT

ప్రతి ఏటా తెలుగు చిత్రసీమలో ఏడాది సమీక్షలంటే హిట్-ఫ్లాపులు మాత్రమే చూశాం. కానీ 2015లో మాత్రం టాలీవుడ్ కు ఊహించని ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్నడూ లేనివిధంగా అత్యధిక మరణాలు 2015లోనే సంభవించాయి. మరీ ముఖ్యంగా హాస్యనటులకు సంబంధించి ఒక శకానికి శకమే ముగిసిందని చెప్పాలి. టాలీవుడ్ లో ఊహించని మరణాలపై ఓ అవలోకనం.

2015 లో ఆహుతి ప్రసాద్ అకాల మరణంతో బ్యాడ్ డేస్ ప్రారంభమయ్యాయని చెప్పాలి. అప్పటివరకు చలాకీగా కనిపించిన ఆహుతి ప్రసాద్ ఆకస్మికంగా ఈ లోకాన్ని వీడివెళ్లడం అందర్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆహుతి సినిమాతో గుర్తింపు తెచ్చుకొని, వందలాది క్యారెక్టర్ రోల్స్ పోషించిన నటుడు ఆయన. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయనకు తెలిసినంతగా మరొకరికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఆహార్యంలోనే కాదు…. వాచకంపై కూడా పట్టున్న అతికొద్ది మంది నటుల్లో ఆహుతి ప్రసాద్ ఒకరు. క్యాన్సర్ తో బాధపడుతూ జనవరి 4, 2015న ఆహుతి ప్రసాద్ ఈ లోకాన్ని వీడారు.

ఆహుతి ప్రసాద్ కన్నుమూసిన గంటల వ్యవధిలోనే మరో ప్రముఖుడి అస్తమయం టాలీవుడ్ విషాదాన్ని కొనసాగించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మాటలు రాసిన గణేష్ పాత్రో…. జనవరి 5న కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అద్భుత కళాఖండాలైన మరోచరిత్ర, రుద్రవీణ లాంటి సినిమాల నుంచి మొన్నటి సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు వరకు…. ఎన్నో హిట్ సినిమాలకు మాటలందించారు గణేష్ పాత్రో. ఇదే ఏడాది, ఇదే జనవరిలో సీనియర్ ప్రొడ్యూసర్, జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ కూడా కన్నుమూశారు. దసరా బుల్లోడు లాంటి క్లాసిక్ ను తెలుగుతెరకు అందించిన వీబీ రాజేంద్రప్రసాద్…. జనవరి 12, 2015న అస్తమించారు.

ఇక ఇదే నెలలో నవ్వుల రేడు, ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ కూడా అస్తమించారు. డిఫరెంట్ డైలాగ్ డెలివరీ, మేనరిజమ్స్ తో తిరుగులేని హాస్యనటుడిగా ఎదిగిన ఎమ్మెస్ నారాయణ…. జనవరి 23, 2015లో తుదిశ్వాస విడిచారు. తెలుగుతెరపై అతని ముద్ర సుస్పష్టం. అతడు లేని లోటు కూడా అంతే విస్పష్టం.

మూవీ మొఘల్….. గిన్నిస్ రికార్డు హోల్డర్….. అన్ని భారతీయ భాషల్లో సినిమాలు తీసిన లెజెండ్…. డా.డి.రామానాయుడు కూడా 2015లోనే కన్నుమూశారు. 1936లో ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించిన రామానాయుడు…. తన తుదిశ్వాస వరకు సినిమాలే లోకంగా బతికారు. ప్రతి రోజు సినిమా సెట్స్ లోనే గడిపారు. అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో సినిమాలు నిర్మించాలనే కలను సాకారం చేసుకొని, ప్రఖ్యాత దాదాసాహెబ్ పాల్కే అవార్డును కూడా అందుకున్నారు.

ఇక 2015, ఆశ్చర్యకర మరణాల్లో ఆర్తి అగర్వాల్ కూడా ఉంది. తెలుగుతెరపై ఒక దశలో క్రేజీ హీరోయిన్ గా కొనసాగిన ఆర్తి… తర్వాత సినిమాలకు దూరమై అమెరికా వెళ్లిపోయింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని అట్లాంటా సిటీలో స్థూలకాయం తగ్గించుకునే చికిత్స (లైపోసక్సన్) చేయించుకుంది. అయితే అది వికటించి…. జూన్ 6న మరణించింది. చనిపోయే సమయానికి ఆమె వయసు 31.

శంకరాభరణ, సాగరసంగమం లాంటి కళాఖండాల్ని తీసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావును కూడా 2015లోనే టాలీవుడ్ కోల్పోయింది. 1934లో జన్మించిన ఏడిద…. పూర్ణోదయ క్రియేషన్స్ బ్యానర్ పై అద్భుతమైన చిత్రాల్ని నిర్మించారు. వయసు రీత్యా వచ్చిన రుగ్మతలతో… అక్టోబర్ 4, 2015న కన్నుమూశారు.

విభిన్న పాత్రలు పోషించి దక్షిణాదినే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మనోరమను కూడా ప్రేక్షకులు ఈ ఏడాది కోల్పోయారు. సౌత్ లో అలనాటి స్టార్ హీరోలందరికీ తల్లిగా నటించిన మనోరమ…. అక్టోబర్ 10న చెన్నైలో మరణించారు.


2014లో ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్ లాంటి హాస్యనటుల్ని కోల్పోయిన పరిశ్రమ…. 2015లో మరింత మంది కమెడియన్లను పోగొట్టుకుంది. దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని నవ్వించిన కళ్లు చిదంబరం, మాడా వెంకటేశ్వరరావు, కొండవలస లక్ష్మణరావు లాంటి ప్రముఖ హాస్యనటుల్ని కోల్పోయింది. అక్టోబర్ 18న విశాఖలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో కళ్లుచిదంబరం కన్నుమూశారు. మాడా పాత్రలకు పెట్టింది పేరైన మాడా వెంకటేశ్వరరావు…. అక్టోబర్ 24న హైదరాబాద్ లో తుదిశ్వాస విడవగా…. మరో హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు…. 69 ఏళ్ల వయసులో నవంబర్ 2న అస్తమించారు. ఇక తాజాగా మరో సీనియర్ నటుడు, హీరో రంగనాధ్ కూడా కన్నుమూయడం చిత్రసీమను విచారంలోకి నెట్టింది. 66 ఏళ్ల రంగనాధ్, డిసెంబర్ 19న హైదరాబాద్ లోని తన స్వగృహంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా టాలీవుడ్…. 2015లో చాలామంది ప్రముఖుల్ని కోల్పోయింది.

Tags:    
Advertisement

Similar News